బెంగళూరు, జూన్ 7: జమ్ము-శ్రీనగర్‌ను అనుసంధానం చేసేందుకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సింగిల్ ఆర్చ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్ల ఎత్తయిన ఇంజినీరింగ్ అద్భుతంగా వర్ణించే ఈ చినాబ్ రైలు వంతెనను డిజైన్ చేసింది ఓ తెలుగు మహిళ. ఈ వంతెన నిర్మాణం కోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని(ఐఐఎస్సీ) సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జియో టెక్నికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి మాధవీలత, ఆమె బృందం 17 ఏండ్ల సమయాన్ని జాతి సేవకు అంకితం చేశారు. ఇండియన్ జియో టెక్నికల్ జర్నల్ మే 28న ప్రచురించిన మహిళల ప్రత్యేక సంచికలో మాధవీ లత ఓ వ్యాసాన్ని రాశారు. భారత్ వందేండ్ల కల అయిన ఈ వంతెన నిర్మాణం, డిజైనింగ్‌లో తాము ఎదుర్కొన్న సవాళ్లను అందులో వివరించారు.
జియో టెక్నికల్ ఇంజినీరింగ్ పరిశోధనలో మేటి
వరంగల్ ఎన్ఐటీలో ఎంటెక్, ఐఐటీ-మద్రాసులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన డాక్టర్ మాధవీ లత 2004లో ఐఐఎస్సీలో చేరడానికి ముందు ఐఐటీ-గువాహటిలో బోధించారు. ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ నుంచి జియో టెక్నికల్ ఇంజినీరింగ్ అవార్డును అందుకున్న తొలి ఉత్తమ పరిశోధకురాలు. మాధవీ లతే. ఐఐఎస్సీ ప్రొఫెసర్ ఎస్కే చటర్జీ ఔట్ స్టాండింగ్ రీసెర్చర్ అవార్డును, కర్ణాటక బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి మహిళా కార్యసాధకురాలు అవార్డును అందుకున్నారు. టీమ్ ఆఫ్ ఇండియాలోని 75 మంది మహిళల్లో ఆమె అగ్రస్థానంలో నిలిచారు.
టాయిలెట్ కోసం పోరాటం
డాక్టర్ మాధవీ లత ఐఐఎస్సీలో చేరినపుడు ఆమే తొలి మహిళా పాకల్టీ సభ్యురాలు. అయితే ఆమె జియో టెక్నికల్ ఇంజినీరింగ్ భవనంలో మహిళల కోసం ప్రత్యేకంగా టాయిలెట్ నిర్మాణానికి ఆమె గట్టి పోరాటం చేసి సాధించారు.