బెంగళూరు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) విద్యార్థి అర్ధరాత్రి వేళ స్నేహితులతో కలిసి తన పుట్టిన రోజు జరుపుకున్నాడు. కేక్ కట్ చేసి ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత హాస్టల్‌కు తిరిగి వెళ్తూ బిల్డింగ్ రెండో అంతస్తు పైనుంచి కింద పడి మరణించాడు. (IIM-Bangalore student) దీంతో ఆ క్యాంపస్‌లో తీవ్ర విషాదం నెలకొన్నది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన నిలయ్ కైలాష్భాయ్ పటేల్, బెంగళూరులోని ఐఐఎంలో పీజీపీ చదువుతున్నాడు. జనవరి 4న అతడు 29వ ఏట ప్రవేశించాడు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి వేళ హాస్టల్లోని ఫ్రెండ్ రూమ్‌లో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. స్నేహితులతో కలిసి కేక్ కట్ చేశాడు. వారితో కలిసి ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత హాస్టల్లోని తన రూమ్‌కు తిరిగి వెళ్లాడు.
కాగా, ఆదివారం తెల్లవారుజామున 6.30 గంటలకు హాస్టల్ బిల్డింగ్ వద్ద నిలయ్ కైలాష్భాయ్ పటేల్ పడి ఉండటాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించారు. అయితే నిలయ్ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బర్త్ డే సెలబ్రేషన్ తర్వాత హాస్టల్లోని తన గదికి వెళ్తూ రెండో అంతస్తు నుంచి కింద పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. కాగా, నిలయ్ మరణం పట్ల ఐఐఎం-బీ సంతాపం తెలిపింది. బ్రిలియంట్, ఫ్రెండ్లీ స్టూడెంట్ను కోల్పోయినట్లు పేర్కొంది.