Uttar Pradesh | లక్నో: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, విజయాలకు ప్రచారం కల్పించేందుకు సోషల్మీడియా ఇన్ప్లుయెన్సర్లను యూపీ సర్కారు రంగంలోకి దించనుంది. ఈ మేరకు నూతన సోషల్మీడియా పాలసీని రూపొందించింది. దీని ప్రకారం.. ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడం ద్వారా ఇన్ఫ్లుయెన్సర్లు నెలకు రూ.8 లక్షల వరకు ఆర్జించవచ్చు. దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సర్కారుకు ఓటమి తప్పదని, దీన్నుంచి ఏ సోషల్మీడియా వారియర్ కూడా రక్షించలేరని స్పష్టంచేశాయి. మరోవైపు, సోషల్మీడియాలో దేశ వ్యతిరేక పోస్ట్లు పెట్టేవారికి మూడేళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష విధించేలా నూతన పాలసీలో నిబంధనలు పొందుపరిచారు.
న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పెచ్చరిల్లిపోయిందని, ఒక్కొక్కటిగా అక్రమాల వ్యవహారాలు బయటకొస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్టుకు ప్రభుత్వం అక్రమంగా భూ కేటాయింపు చేసిందని పేర్కొన్నది. బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది బుధవారం మీడియాతో మాట్లాడుతూ వేలం నిర్వహించకుండా భూ కేటాయింపు జరిగిందని ఆరోపించారు. ‘కొంత భూమి కేటాయించాలని సాంఘిక న్యాయం, సంక్షేమ విభాగం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 14న కోరినా కేటాయించలేదు. 72 దరఖాస్తులు క్యూలో ఉన్నప్పటికీ ఖర్గే కుటుంబానికి భూమి కేటాయించారు’ అని ఆయన ఆరోపించారు. ఈ-వేలం ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.