న్యూఢిల్లీ: ఆడపిల్లల కనీస వివాహ వయసును 18 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ప్రధాన పార్టీ అయిన సమాజ్వాదీ పార్టీ నేతలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఎస్పీ సీనియర్ నేత, ఎంపీ షఫీకుర్ రహమాన్ ఆ నిర్ణయాన్ని తప్పుపట్టారు. తాజాగా అదేపార్టీ ఎంపీ ఎస్టీ హసన్ ఆయనకు జత కలిశారు.
బాలికలు తమకు యుక్త వయసు రాగానే పెండ్లి చేసుకోవాలని, పరిపక్వత వచ్చిన బాలిక 16 ఏండ్ల వయసులో వివాహం చేసుకున్నా తప్పేమీ కాదని ఎస్టీ హసన్ అభిప్రాయపడ్డారు. అయినా బాలికలు 18 ఏండ్ల వయసులో ఓటేయడానికి అర్హులు అయినప్పుడు.. పెండ్లి మాత్రమే ఎందుకు చేసుకోకూడదు..? అని ఆయన ప్రశ్నించారు.