న్యూఢిల్లీ: జార్ఖండ్‌కు చెందిన గిరిజన మహిళను ఎవరైనా చొరబాటుదారులు పెళ్లి చేసుకుంటే, వాళ్లకు పట్టా భూములను ఇవ్వబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) తెలిపారు. సెరైకేలాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే, చొరబాటుదారులకు భూమి బదలాయింపును నిలిపివేసే చట్టాన్ని రూపొందించనున్నట్లు చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్న వారిని చొరబాటుదారులు భావిస్తే మంత్రి ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
మన కూతుళ్లను పెళ్లి చేసుకున్న చొరబాటుదారులు మన భూమిని లాక్కుంటున్నారని, గిరిజన మహిళను పెళ్లి చేసుకుంటే జరిగే భూ బదలాయింపు ప్రక్రియను అడ్డుకునేందుకు చట్టాన్ని తేనున్నట్లు చెప్పారు. చొరబాటుదారుల్ని గుర్తించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆ చొరబాటుదారుల నుంచి భూమిని తిరిగి లాక్కుంటామని మంత్రి పేర్కొన్నారు. బంగ్లాదేశీ చొరబాటుదారులకు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతు నిలుస్తున్నాయని ఇటీవల ప్రధాని మోదీ కూడా తన ప్రసంగంలో ఆరోపించారు.