Ajaypal Sharma : పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని ఫాల్టా నియోజకవర్గం (Falta Constituency) లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఓటర్లను బెదిరిస్తున్నారని ఎన్నికల అధికారులకు సమాచారం అందింది. దాంతో అక్కడ ఎన్నికల విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారి అజయ్‌పాల్ శర్మ (Ajaypal Sharma) ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దాంతో అధికారి బెదిరిస్తున్నారంటూ టీఎంసీ నేతలు నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ (Jahangir Khan) మాట్లాడుతూ.. ‘నువ్వు సింగం అయితే నేను పుష్ప’ అని ఐపీఎస్ అజయ్‌పాల్ శర్మను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కాగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అజయ్ పాల్ శర్మ 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయనకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరుంది. స్థానికంగా ఆయన్ను పోలీస్ సింగంగా పిలుస్తుంటారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈసీ నియమించిన 95 మంది ప్రత్యేక పరిశీలకుల్లో శర్మ ఒకరు. దక్షిణ 24 పరగణాలు జిల్లాలో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఓటర్ల నుంచి కొందరు ఓటరు కార్డులు సేకరిస్తున్నారని, ఓటర్లను బెదిరిస్తున్నారని ఆయనకు సమాచారం వచ్చింది. దాంతో ఆయా ప్రాంతాల్లో పర్యటించిన అజయ్ శర్మ.. ఎవరైనా ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో స్థానిక టీఎంసీ శ్రేణులు నిరసనకు దిగాయి. స్థానిక టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ స్పందిస్తూ.. తమ నేతలు, కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తే సహించే ప్రసక్తే లేదని అన్నారు. అర్ధరాత్రి సమయంలో ఐపీఎస్ అధికారి తన ఇంటికి వచ్చి హెచ్చరికలు చేశారని తెలిపారు. ఒకవేళ ఆయన సింగం (ఐపీఎస్ అజయ్ పాల్ శర్మ) అయితే, తాను పుష్ప అంటూ సినిమా డైలాగ్ చెప్పారు. ఆయన బలగాలను వెంటపెట్టుకొని వచ్చి తన మద్దతుదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.