న్యూఢిల్లీ : మహిళల్లో గర్భధారణ ఏవిధంగా జరుగుతుందో వివరంగా తెలుసుకోవడానికి నిర్వహించిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు అనుకోకుండా ‘జన్యు మీట’ (జెనెటిక్ స్విచ్)ను కనుగొన్నారు. అండం తనంతటతాను స్త్రీ గర్భంలోని గోడపై అతుక్కునేందుకు, తద్వారా గర్భధారణ జరిగేందుకు ఈ మీట దోహదపడుతుంది. గర్భధారణ ప్రారంభం కావాలంటే, అండం తప్పనిసరిగా తల్లి గర్భంలోని గోడపై అతుక్కోవాలి, నాటుకోవాలి. ఇది ఎలా జరుగుతుంది? అనే విషయం అంతుబట్టకుండా మిగిలిపోయింది. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ నివేదికను ‘సెల్ డెత్ డిస్కవరీ’ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించారు.
అండం నాటుకోవడాన్ని నియంత్రించే ప్రాథమిక బయలాజికల్ జెనిటిక్ స్విచ్‌ను ఈ అధ్యయనంలో గుర్తించారు. ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ (ముంబై), బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (వారణాసి), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఐసీఎంఆర్-ఎన్ఐఆర్ఆర్సీహెచ్ డైరెక్టర్ డాక్టర్ గీతాంజలి మాట్లాడుతూ, కొందరు మహిళలు పదే పదే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్‌ను ఎందుకు ఎదుర్కొంటారు? ప్రారంభ దశలోనే గర్భస్రావం ఎందుకు జరుగుతుంది? అనే విషయాలను ఈ బయలాజికల్ స్విచ్‌ను అర్థం చేసుకోవడం వల్ల వివరించవచ్చునని తెలిపారు.