మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 02:45:33

వ్యాక్సిన్‌కు డెడ్‌లైనా..!

వ్యాక్సిన్‌కు డెడ్‌లైనా..!

  • ఆగస్టు 15లోపు టీకా తయారీ ఎలా సాధ్యం?
  • శాస్త్రవేత్తలు, వైద్యుల అభ్యంతరం

న్యూఢిల్లీ, జూలై 4: కొవిడ్‌-19కు దేశీయ టీకా ఆగస్టు 15వ తేదీలోపు అందుబాటులోకి రావాలన్న ఐసీఎంఆర్‌ ఆదేశాలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఇంకా హ్యూమన్‌ ట్రయల్సే మొదలుకాకుండా టీకాకు డెడ్‌లైన్‌ ఎలా విధిస్తారని ఫార్మాకంపెనీలు, వైద్యులు, శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆదేశాలపై ప్రతిపక్ష పార్టీలు కూడా కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఐసీఎంఆర్‌ మాత్రం దేశంలో వైరస్‌ విజృంభన నేపథ్యంలో వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారిక అడ్డంకులు ఎదురుకాకుండా ఫాస్ట్‌ట్రాక్‌ విధానం అమలు చేసేందుకే డెడ్‌లైన్‌ విధించినట్టు వివరణ ఇచ్చింది.

నాలుగు వారాల్లో వ్యాక్సిన్‌ ఎలా సాధ్యం?

ఏదైనా వ్యాధికి నిర్ణీత వ్యవధిలో వ్యాక్సిన్‌ తయారీ ఎలా సాధ్యమవుతుందని వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ‘ఎంత సమర్థంగా పనిచేసినా ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో కేవలం నాలుగు వారాల్లో భద్రత, రోగనిరోధకత, సమర్థత పరంగా మెరుగైన వాక్సిన్‌ తయారుచేయటం సాధ్యం కానేకాదు’ అని వెల్‌కం ట్రస్ట్‌ సీఈవో, ప్రముఖ వైరాలజిస్టు షాహిద్‌ జమీల్‌ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ తయారుచేసే ప్రయత్నాలను అభినందించాల్సిందేనని, కానీ అందుకోసం డెడ్‌లైన్లు పెట్టుకోవటం సరికాదని మరో వైరాలజిస్టు ఉపాసనా రాయ్‌ అన్నారు. 

ప్రమాణాల ప్రకారమే క్లినికల్‌ ట్రయల్స్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ‘కొవాగ్జిన్‌' క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తామని ఐసీఎంఆర్‌ పేర్కొన్నది. కొవాగ్జిన్‌ను పూర్తిగా పరిశీలించిన తర్వాతే మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి ఇచ్చిందని వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.త్వరలో హ్యూమన్‌ ట్రయల్స్‌ ప్రారంభమవుతాయని తెలిపింది.  


logo