న్యూఢిల్లీ: ఆధార్ కార్డులను జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) ముఖ్య కార్య నిర్వహణ అధికారి (సీఈవో)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సౌరభ్ భరద్వాజ్ బుధవారం నియమితులయ్యారు. 1998 బ్యాచ్ గుజరాత్ క్యాడర్ అధికారి అయిన ఆయన నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. భారత ప్రభుత్వానికి అదనపు కార్యదర్శి హోదా, వేతన ర్యాంక్‌లో ఆయన ఇకపై విధులు నిర్వహిస్తారని సిబ్బంది, వ్యక్తిగత వ్యవహారాల శాఖ ఆదేశాలు తెలిపాయి. మరోవైపు అంతర్ రాష్ట్ర మండలి సచివాలయానికి సలహాదారుగా గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి మనీశ్ భరద్వాజ్ నియమితులయ్యారు. భరద్వాజ్ ప్రస్తుతం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన స్థానంలో 1999 బ్యాచ్ పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి నిశికాంత్ ఎస్ అవధ్ నియమితులయ్యారు. ఆయన క్యాడర్ సహచరుడు ప్రియాంక్ భర్తీ కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు.