Puja Khedkar | మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు పుణే పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమె లగ్జరీ కారును పోలీసులు సీజ్ చేశారు. మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించి తన ప్రైవేటు కారుపై వీఐపీ నంబర్ ప్లేట్, కార్‌పై రెడ్, బ్లూకలర్ బీకన్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు ప్రభుత్వం అనుమతి లేకుండానే ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అని రాయడంతో పోలీసులు కార్‌ను సీజ్ చేశారు. ఏకంగా కారు 21 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిందంటూ రూ.26వేల జరిమానా కూడా విధించారు. ట్రాఫిక్ విభాగం సిబ్బంది నోటీసులు జారీ చేయడంతో ఖేద్కర్ కుటుంబానికి డ్రైవర్ కారు తాళాలను తీసుకెళ్లి చతుష్రింగి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో అధికారులకు అప్పగించాడు. కారుకు సంబంధించిన పత్రాలు తమకు అందలేని పోలీసులు పేర్కొన్నారు. పూజ ఖేద్కర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం, దురుసు ప్రవర్తనతో ఒక్కసారిగా వార్తలకెక్కారు.
పుణే అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకునే ముందే తనకు ఓ ఇల్లు, కారు కావాలని ఆమె డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. అలాగే, 2023 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సొంత కారుకు సైరన్, వీఐపీ నంబర్ ప్లేట్లు, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ అంటించుకున్నట్లుగా విమర్శలున్నాయి. పుణే అదనపు కలెక్టర్ బయటకు వెళ్లిన సమయంలో ఆయన కార్యాలయాన్ని ఉపయోగించుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత ఆమెసై పుణే కలెక్టర్ సీఎస్‌కు ఫిర్యాదు చేయడంతో ఆమెపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మరో వైపు పూజా ఖేడ్కర్ యూపీఎస్సీ ఎంపికపై సైతం వివాదం కొనసాగుతున్నది. పాక్షిక అంధత్వం, మనోవైకల్యంతో బాధపడుతున్నట్లు కాగితాలు సమర్పించి.. పూజా ఖేడ్కర్ ఆ కోటాలో సెలెక్ట్ అయ్యారు. కానీ, తప్పనిసరి వైద్య పరీక్షలను ఎదుర్కొనేందుకు నిరాకరించారు. వైద్య పరీక్షలకు హాజరు కావాలన్న నోటీసులను మాత్రం పట్టించుకోలేదు. ఆరోసారి పాక్షికంగానే వైద్య పరీక్షలకు హాజరవగా.. దృష్టి లోపానికి సంబంధించి ఎంఆర్ఐ స్కానింగ్ పరీక్షకు గైర్హాజరయ్యారు.
ఓ ప్రైవేటు సంస్థ నుంచి ఎంఆర్ఐ నివేదికను సమర్పించారు. దీంతో ఆమె ఎంపికను యూపీఎస్సీ క్యాట్‌లో సవాల్ చేసింది. 2023 ఫిబ్రవరిలో క్యాట్ ఆమెకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వగా.. రాజకీయ పలుకుబడి ఉపయోగించి పోస్టింగ్‌ను తెచ్చుకున్నారు. పూజా ఖేడ్కర్ ఓబీసీ నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్‌ను సమర్పించడంపై సైతం వివాదం ఉన్నది. ఆమె తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ దిలీప్ ఖేడ్కర్ పేరిట రూ.40 కోట్లు, తల్లి మనోరమ పేరుతో రూ.15 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తేలింది. అలాగే జాయినింగ్‌కు ముందు తన పేరిట రూ.17కోట్ల విలువైన స్థిరాస్తులు, వాటిపై రూ.43 లక్షల వార్షిక ఆదాయం వస్తున్నట్లు యూపీఎస్సీకి సమర్పించిన డిక్లరేషన్‌లో పూజా వెల్లడించింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తండ్రి వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ తరఫున పోటీ చేశారు. యూపీఎస్సీ పరీక్షల్లో పూజా ఖేడ్కర్ ఆలిండియా స్థాయిలో 841 ర్యాంక్ సాధించింది.