షాజహాన్పూర్ : యూపీలోని షాజహాన్పూర్లో సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా బాధ్యతలు చేపట్టిన ఒక ఐఏఎస్ అధికారి తన చర్యలతో మొదటి రోజే వార్తల్లో నిలిచారు. తన కార్యాలయం పరిశుభ్రంగా లేకపోవడానికి తనదే తప్పు అని అంగీకరిస్తూ ఐఏఎస్ అధికారి రింకూ సింగ్ సాహి గుంజీలు తీసి క్షమాపణ చెప్పారు. మంగళవారం తహశీల్ కార్యాలయం తనిఖీ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
పరిసరాల్లోనే బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్న వారిని రింకూ సింగ్ పట్టుకుని తప్పుకు శిక్షగా వారితో గుంజీలు తీయించారు. తహశీల్ కార్యాలయ ప్రాంగణం కూడా చాలా అపరిశుభ్రంగా ఉంది కదా? దానికి మీరు బాధ్యత వహిస్తారా? అని అక్కడి న్యాయవాదులు ఆయనను నిలదీశారు. దీంతో ఆయన గుంజీలు తీసి క్షమాపణ చెప్పారు.