న్యూఢిల్లీ: త్రివిధ దళాలు ఐక్యంగా పనిచేసేందుకు థియేటర్ కమాండ్లు(Theatre Commands) ఏర్పాటు చేయాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ రెండు రోజుల క్రితం పేర్కొన్నారు. రణ్ సంవాద్ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేవీ, ఆర్మీ, వైమానిక దళం కలిసి థియేటర్ కమాండ్లు ఏర్పాటు చేస్తే, సరిహద్దుల్లో శత్రువులను ఎదుర్కొనడం సులువు అవుతుందన్నారు. సీడీఎస్ అనిల్ చౌహాన్ చేసిన ప్రతిపానను వైమానిక దళ చీఫ్ వ్యతిరేకించారు. దీంతో మూడు దళాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే త్రిపాఠి కీలక విషయాన్ని వెల్లడించారు. థియేటర్ కమాండ్ల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉందని త్రిపాఠి అన్నారు.
బుధవారం కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఇప్పట్లో థియేటర్ కమాండ్లు అవసరం లేదని ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు. ఆర్మీ వార్ కాలేజీలో ఆయన మాట్లాడుతూ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మిలిటరీ మధ్య సహకారం కోసం మరో విధమైన ఫార్మాట్ అవసరం లేదన్నారు. సర్వీస్ చీఫ్‌ల స్థాయిలో సమావేశం ఉంటే సరిపోతుందన్నారు. అయితే థియేటర్ కమాండ్ల అంశంపై ఇవాళ నేవీ చీఫ్ అడ్మిరల్ త్రిపాఠి మాట్లాడుతూ .. థియేటర్ కమాండ్ విధానం ఏర్పాటే తమ లక్ష్యమన్నారు. తమ శక్తి సామర్థ్యాలకు చెందిన అంశాన్ని.. ఆర్మీ, ఐఏఎఫ్ తో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఓ నిర్ధిష్ట ప్రాంతం లేదా ఏరియా నుంచి ఓ మిలిటరీ కమాండర్ ఆధ్వర్యంలో ఆపరేషన్స్ నిర్వహించడమే సైనిక భాషలో థియేటరైజేషన్ అంటారు. ఆ థియేటర్ కమాండ్ ద్వారా విమానాలు, చాప్టర్లు, గన్స్, ట్యాంకులు, ఎక్విప్మెంట్, మ్యాన్‌పవర్‌ను కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఏకీకృత ప్లానింగ్‌తో ముందుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామని, సమైక్యంగా, సమగ్రమైన ఆపరేషన్స్ నిర్వహిస్తామన్నారు.
రణ్ సంవాద్ సెమీనార్ ముగింపు కార్యక్రమం ఇవాళ నిర్వహిస్తున్నారు. థియేటర్ కమాండ్ల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం సీడీఎస్ చీఫ్‌కు పీస్‌మేకర్ పాత్రను కల్పించింది. భిన్నాభిప్రాయం వస్తుందంటే, ఇది మంచి సంకేతమే అని సీడీఎస్ అన్నారు. దేశ ప్రయోజనాల కోసం దీన్ని త్వరలోనే పరిష్కరిస్తారని చౌహాన్ తెలిపారు. భిన్నాభిప్రాయాలను అనుకూల వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు అని సీడీఎస్ అన్నారు. భిన్న అభిప్రాయాలను ఓపెన్‌గా చర్చించాలన్నారు. ప్రతి ఒక దళానికి చెందిన అభిప్రాయాలను వినేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.
ప్రస్తుతం దిగువ స్థాయిలో కొత్త విధానం అవసరం లేదని ఎయిర్ చీఫ్ మార్షల్ పేర్కొన్నారు. కొత్త విధాన రూపకల్పనకు ఎవరూ వత్తిడిలోకి వెళ్లవద్దు అన్నారు. దీంతో త్రివిధ దళాల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు బహిర్గతం అయ్యాయి.