Kerala Governor: కేరళలో అక్కడి ప్రభుత్వానికి, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ కేవలం 78 సెకన్లు మాత్రమే ప్రసంగించారు. ప్రభుత్వం ఇచ్చిన 60 పేజీల ప్రసంగాన్ని చదవకుండా పక్కనపడేశారు. దాంతో రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోమ్‌ను పినరయి విజయన్ సర్కారు బహిష్కరించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం ఉదయం SFI ఆందోళనకారులు కొల్లామ్‌లో గవర్నర్ కాన్వాయ్కి అడ్డుతగిలారు. యూనివర్సిటీ ఛాన్సెలర్ల నియామకానికి గవర్నర్ అడ్డుపుల్ల వేస్తున్నాడంటూ నల్లజెండాలు ప్రదర్శించారు. దాంతో ఆగ్రహించిన గవర్నర్ కారు దిగి ఆందోళనకారుల వైపు దూసుకెళ్లారు. దాంతో గవర్నర్ రక్షణగా పోలీసులు హ్యూమన్ షీల్డ్ ఏర్పాటు చేశారు. గవర్నర్‌ను తిరిగి కారులోకి రావాలని విజ్ఞప్తి చేశారు.
కానీ గవర్నర్ అందుకు నిరాకరించారు. పోలీసుల వైఫల్యంవల్లే SFI కార్యకర్తలు తన కాన్వాయ్కి అడ్డుతగిలారని మండిపడ్డారు. తన కాన్వాయ్ వెళ్లే మార్గంలో SFI ఆందోళనకారులను ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఇలాగే అనుమతిస్తారా..? అని నిలదీశారు. పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడే రోడ్డు పక్కన ఉన్న చాయ్ దుకాణం ముందు బైఠాయించారు. ఆందోళకారులపై చర్యలు తీసుకునే వరకు తాను ఇక్కడి నుంచి కదిలేదే లేదని తేల్చిచెప్పారు.
దాంతో పోలీసులు ఘటనకు సంబంధించి 12 మందిని అరెస్ట్ చేశామని గవర్నర్‌కు చెప్పారు. తన కాన్వాయ్కి 50 మందికి పైగా అడ్డుతగిలితే 12 మందినే ఎందుకు అరెస్ట్ చేశారని ఆయన ప్రశ్నించారు. మిగతా వాళ్ల సంగతేమిటని మండిపడ్డారు. ఆందోళనకారుల అరెస్ట్‌లకు సంబంధించి FIR కాపీలు చూపించాలని అన్నారు. గవర్నర్ బైఠాయింపునకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.