ముంబై: ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో లేదో.. ప్రత్యర్థి పార్టీలపై కేంద్రంలోని బీజేపీ తన మార్కు ప్రతాపాన్ని చూపిస్తున్నది. మహారాష్ట్రలో శివసేన మంత్రులు, నేతల సన్నిహితుల ఇండ్లపై ఐటీ సోదాలు చేయిస్తున్నది. మంగళవారం మంత్రులు ఆదిత్య ఠాక్రే, అనిల్ పరబ్ సన్నిహితుల కార్యాలయాలు, ఇండ్లపై ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదిత్య ఠాక్రేకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాహుల్ కనాల్ ఇండ్లు, కార్యాలయాలపైనా దాడులు జరిగాయి. ఆయన షిర్డీ సాయిబాబా దేవాలయం ట్రస్టు సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే కేబుల్ ఆపరేటర్ సదానంద్ కదమ్, ఆర్టీవో అధికారి బజరంగ్ ఖర్మటే కార్యాలయాలపైనా ఐటీ అధికారులు తనిఖీలు జరిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ పబ్లిసిటీ యంత్రాంగాలుగా వాడుకుంటున్నదని, వాటిని దుర్వినియోగం చేస్తున్నదని మంత్రి ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు. ఇలాంటి జిమ్మిక్కులకు మహారాష్ట్ర లొంగబోదని పేర్కొన్నారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని బీజేపీ ఏటీఎం మెషీన్గా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అభివర్ణించారు. ఏ కంపెనీపై ఈడీ దాడులు జరిగినా వెంటనే ఈడీ రికవరీ ఏజెంట్ జితేంద్ర నవలానీకి చెందిన సంస్థలకు డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతుంటాయని ఆరోపించారు. ఈడీకి చెందిన నలుగురు అధికారులపై ముంబై పోలీసులు విచారణ చేస్తున్నారని, వారు త్వరలోనే జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రం పన్నుతున్న కుట్ర ఇది అని ఆరోపించారు.