Nana Patole : మహారాష్ట్ర (Maharastra) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) కాంగ్రెస్ పార్టీ (Congress party) ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే (Nana Patole) రాజీనామా చేశారంటూ వచ్చిన వార్తలను ఆయన కొట్టివేశారు. తాను ఎలాంటి రాజీనామా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన పదవీకాలం మూడేళ్లు మాత్రమేనని, కానీ తాను నాలుగేళ్లుగా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నానని ఆయన చెప్పారు.
అయినా తాను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేయడం, చేయకపోవడం అనేది తమ పార్టీ అంతర్గత వ్యవహారమని పటోలే వ్యాఖ్యానించారు. అయితే ప్రతి ఒక్కరికీ పార్టీ కోసం పనిచేసే అవకాశం దక్కాలని ఆయన అభిప్రాయపడ్డారు. మా పార్టీ గెలిచిన క్రెడిట్ తాను ఎన్నడూ తన ఖాతాలో వేసుకోలేదని, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కూడా ప్రతి ఒక్కరూ బాధ్యులేనని ఆయన అన్నారు.
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మళ్లీ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికే మరాఠీ ప్రజలు పట్టంకట్టారు. దాంతో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశారు. ఏక్నాథ్ షిండే శివసేన పార్ట అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ చీఫ్ అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.