న్యూఢిల్లీ: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ఎట్టకేలకు తన మౌనాన్ని వీడారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను తప్పుగా అంచనా వేసినట్లు ఒప్పుకున్నారు. తమ అంచనాలు 20 శాతం తప్పుగా ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ బీజేపీ ఓటు శాతం స్థిరంగా ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సుమారు 300 సీట్లు వస్తాయని, సొంత బలంతోనే మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పోలింగ్‌కు ముందు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. అయితే ఫలితాల్లో బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తన అంచనాలు తప్పని అంగీకరించారు. ‘బీజేపీకి దాదాపు 300 సీట్లు వస్తాయని ఊహించాం. కానీ 240 సీట్లు వచ్చాయి. సుమారు 20 శాతం తప్పుగా అంచనా వేశాం’ అని అన్నారు.
కాగా, లోక్‌సభ ఎన్నికల్లో తన అంచనాలను ప్రశాంత్ కిషోర్ సమర్థించుకున్నారు. బీజేపీకి సీట్లు తగ్గినప్పటికీ సాధారణ ఓటరు సెంటిమెంట్ చాలా వరకు ఖచ్చితంగా ఉందని తెలిపారు. బీజేపీ ఓటు శాతం స్థిరంగా ఉందని చెప్పారు. ‘బీజేపీ పట్ల ప్రజల్లో కొంత అసంతృప్తి, కోపం ఉంది. కానీ మోదీ పట్ల విస్తృతమైన శత్రుత్వం లేదు’ అని అన్నారు. ప్రధాని మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థంగా నడపగలరని తెలిపారు. అలాగే మరో 20 నుంచి 30 ఏళ్ల వరకు దేశ రాజకీయాల్లో బీజేపీ ఆధిపత్యంలో ఉంటుందన్నారు.
మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీ పనితీరు అంతగా మెరుగుపడలేదని ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. కాంగ్రెస్‌కు లేదా రాహుల్ గాంధీకి ఈ ఫలితాలు పునర్జీవంగా భావించకూడదని అన్నారు. ‘కాంగ్రెస్ చరిత్రలో ఇది మూడో చెత్త ప్రదర్శన. గతం కంటే ఆ పార్టీ ఎక్కువ సీట్లు సాధించింది. వారికి అవకాశాలు ఉన్నాయని ప్రస్తుత పరిణామాలు సూచిస్తున్నాయి. కానీ పెద్దగా పునరాగమనం చెందలేదు’ అని అన్నారు.