Wolves : ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిచ్ జిల్లాలో 30 గ్రామాల ప్రజలకు గడగడ వణికిస్తున్న తోడేళ్లను పట్టుకునేందుకు ఆపరేషన్ ‘ఖేడియా’ పేరుతో అటవీ అధికారుల గాలింపు కొనసాగుతున్నది. డ్రోన్ కెమెరాలతో ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టిన అధికారులు.. ఏడు తోడేళ్లతో కూడిన ఓ గుంపు ఆ గ్రామాలపై దాడులు చేస్తున్నదని గుర్తించారు. ఆ తోడేళ్లను బంధించేందుకు ఆపరేషన్ ఖేడియా పేరుతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
ఆపరేషన్లో భాగంగా ఇప్పటివరకు నాలుగు తోడేళ్లను బంధించారు. మరో తోడేలు అటవీ సిబ్బంది బంధించే క్రమంలో తప్పించుకునేందుకు పరుగులు పెట్టి గుండెపోటుతో మరణించింది. మిగిలిన రెండు తోడేళ్లు కూడా చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాయి. ఇవాళ ఉదయం కూడా ఆ రెండు తోడేళ్లు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన అటవీ సిబ్బంది.. వాటిని బంధించే సమయానికి తప్పించుకుని పారిపోయాయి.
ఇవాళ సాయంత్రానికి ఆ రెండు తోడేళ్లను కూడా పట్టుకుంటామని సెంట్రల్ జోన్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ రేణు సింగ్ చెప్పారు. థర్మల్ డ్రోన్ కెమెరాలతో ఆ తోడేళ్లను వెంటాడుతున్నామని, సాయంత్రానికి వాటిని బంధించగలమనే నమ్మకం తనకు ఉన్నదని ఆమె అన్నారు. కాగా బహ్రెయిచ్ జిల్లాలోని 30 గ్రామాల ప్రజలపై గత నెలన్నర రోజులుగా తోడేళ్లు దాడులు చేస్తున్నాయి. పిల్లలు, పెద్దలను గాయపరుస్తున్నాయి.
రాత్రిపూట నిద్రపోయి ఉన్న పసికందులను కూడా తోడేళ్లు ఎత్తుకెళ్తున్నాయి. తోడేళ్ల దాడుల్లో ఇప్పటివరకు 9 మంది మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తార్పూర్లో తల్లిదండ్రులతోపాటు ఆరుబయట నిద్రిస్తున్న ఐదేళ్ల బాలుడిని తోడేళ్లు ఎత్తుకెళ్లి చంపితిన్నాయి. మూడు, ఆరు, తొమ్మిదేళ్ల వయస్సున్న మరో ముగ్గురు చిన్నారులపై కూడా తోడేళ్లు దాడిచేసి గాయపర్చాయి.
#WATCH | Bahraich, Uttar Pradesh | Renu Singh (Chief Forest Conservator Central Zone) says, “We have caught 4 wolves so far in this rescue operation. Today, they were seen, located and surrounded but unfortunately, they escaped. But our thermal drones are still monitoring them. I… https://t.co/K1gvdFN2Af pic.twitter.com/6iMq6QWWw3
— ANI (@ANI) August 31, 2024