పాట్నా: తాను ఏనుగునని, బీజేపీని తొక్కేస్తానని జేడీయూ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ (Anand Mohan) అన్నారు. బీహార్‌లోని మహిషి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మహాపురా గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివంగత రాజ్‌పుత్ నేత ఇంద్ర దేవ్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వత ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీపై మండిపడ్డారు. తన వైపునకు వేలు చూపిస్తూ.. ‘ఈ ఏనుగు కమలాన్ని తొక్కేసి చింపివేస్తుందనే భయంతో వారు (బీజేపీ) ఉన్నారు. అందుకే నా విడుదల గురించి చాలా కలత చెందుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
కాగా, తాను జీవించి ఉన్నంత వరకు సోషలిజం కోసం పోరాటాన్ని కొనసాగిస్తానని ఆనంద్ మోహన్ అన్నారు. బీహార్‌లో దళిత వ్యతిరేకింగా తనపై ముద్ర వేయడం గురించి ఆయన మాట్లాడారు. మహిషి నియోజకవర్గంలో రాజ్‌పుత్ వర్గం వారు కేవలం 7,000 మందే ఉన్నప్పటికీ, ఈ స్థానం నుంచి 62,000 ఓట్ల తేడాతో ఎన్నికల్లో విజయం సాధించానని, దళితులపై తనకు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమని చెప్పారు. ఢిల్లీ, యూపీ లేదా ఏపీ నుంచి క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకోవలసిన అవసరం తనకు లేదని, అన్నీ నిర్ణయించేది బీహార్ ప్రజలేనని అన్నారు.
మరోవైపు 1994లో ఆనంద్ మోహన్ నేతృత్వంలోని జనం ఐఏఎస్ అధికారి కృష్ణయ్యను కొట్టి చంపిన కేసులో జైల్లో ఉన్న ఆయనకు అనుకూలంగా బీహార్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన వారిని విడుదల చేసేలా ఏప్రిల్ 10న జైలు నిబంధనలకు సవరణలు చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27న ఆనంద్ మోహన్‌తో పాటు మరో 20 మంది జైలు నుంచి విడుదలయ్యారు.
కాగా, ఆనంద్ మోహన్‌కు ఉపశమనం కల్పించేందుకే బీహార్‌లోని జేడీయూ ప్రభుత్వం ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నదని హత్యకు గురైన ఐఏఎస్ అధికారి భార్య ఉమా దేవి ఆరోపించింది. జైలు నిబంధనల సవరణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆమె ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సంబంధిత ఫైళ్లను సమర్పించాలని బీహార్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆనంద్ మోహన్ ఈ మేరకు మండిపడ్డారు.