న్యూఢిల్లీ: భారత ఇన్ఫ్లూయెన్సర్లు పాకిస్థాన్‌లో ప్రయాణించేందుకు అవసరమైన సాయం చేసిన వ్యక్తిని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కింద పనిచేస్తూ లాహోర్‌లో ‘జైయానా ట్రావెల్ అండ్ టూరిజం’ పేరుతో ఓ ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న వ్యక్తిని నోషాబా షెహ్జాద్గా గుర్తించారు. ఇటీవల అరెస్ట్ అయిన భారత సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను విచారిస్తున్నప్పుడు ఈ విషయం బయటపడింది. ఐఎస్ఐ ఆమెను ‘మేడమ్ ఎన్’ అనే కోడ్‌నేమ్‌తో పిలిచేది.
భారత యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వంటి సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లతోపాటు మరెంతోమంది పాక్ సందర్శించేందుకు ఆమె సాయం చేసింది. భారత్‌లో 500 మంది గూఢచారులతో కూడిన భారీ స్లీపర్ సెల్ నెట్వర్క్ ఏర్పాటుకు ఆమె కృషి చేసింది. వ్యాపారవేత్త అయిన షెహజాద్ భర్త పాకిస్థాన్ సివిల్ సర్వీస్‌లో పనిచేసి రిటైరయ్యారు. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ నుంచి ఆమెకు ఎప్పటికప్పుడు సూచనలు అందేవి. పాక్ సందర్శించే భారత సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను ఆమె పాక్ సైన్యం, ఐఎస్ఐకి పరిచయం చేసేది.
గత ఆరు నెలల్లో భారత్ నుంచి 3 వేల మంది పౌరులు, 1500 ప్రవాస భారతీయులు పాకిస్థాన్ సందర్శించేందుకు ఆమె సాయం చేసినట్టు గుర్తించారు. ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంతోనూ ఆమెకు సంబంధాలుండేవి. దీంతో ఆమె కోరుకున్న వ్యక్తికి చిటికెలో వీసా లభించేది. పాక్ రాయబార కార్యాలయంలో వీసా అధికారిగా పనిచేసిన ఐఎస్ఐ ఆపరేటివ్ డానిష్ అలియాస్ ఎహ్సాన్-ఉర్-రెహ్మాన్‌తోనూ ఆమెకు సంబంధాలున్నాయి. జ్యోతి మల్హోత్రా వ్యవహారం బయటపడిన తర్వాత మే నెలలో డానిష్‌ను భారత్ నుంచి బహిష్కరించారు.