ఆదివారం 24 జనవరి 2021
National - Jan 03, 2021 , 15:10:02

కొవాగ్జిన్‌కు ఎలా అనుమ‌తి ఇచ్చారు?: కాంగ్రెస్‌

కొవాగ్జిన్‌కు ఎలా అనుమ‌తి ఇచ్చారు?: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌ల‌కు అనుమ‌తి ఇచ్చే ముందు మూడో ద‌శ ప్ర‌యోగాల ఫ‌లితాల‌ను ఎందుకు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేద‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది కాంగ్రెస్‌. త‌ప్ప‌నిస‌రి నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేంటో వివరించాల‌ని డిమాండ్ చేసింది. ఏ ఇత‌ర దేశం కూడా ఈ కీల‌క ప్ర‌క్రియ‌ల‌ను వ‌దిలివేయ‌లేద‌ని కాంగ్రెస్ చెప్పింది. ముఖ్యంగా కొవాగ్జిన్‌కు అనుమతి ఇవ్వ‌డాన్ని కాంగ్రెస్ ప్ర‌శ్నిస్తోంది. ఈ వ్యాక్సిన్ మూడో ద‌శ ప్ర‌యోగాల‌ను పూర్తి చేయ‌లేద‌ని, అయినా వినియోగానికి అనుమ‌తి ఇవ్వ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని కాంగ్రెస్ నేత శ‌శి థ‌రూర్ అన్నారు. మొత్తం ప్ర‌యోగాలు పూర్త‌య్యే వ‌ర‌కూ కొవాగ్జిన్‌ను వినియోగించ‌కూడ‌ద‌ని ఆయ‌న అన్నారు. ఆలోపు ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్ వాడుకోవాల‌ని సూచించారు. 

అంత‌కుముందు కాంగ్రెస్ పార్టీకే చెందిన జైరామ్ ర‌మేష్ కూడా ఇదే అంశాన్ని లేవ‌నెత్తారు. మ‌రో నేత స‌ల్మాన్ నిజామీ అయితే వ్యాక్సిన్ ఒక మోసం అంటూ ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. మూడో ద‌శ ప్ర‌యోగాలు పూర్తి కాలేద‌ని ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ ముందు భార‌త్ బయోటెక్ చెప్పింద‌ని, అలాంట‌ప్పుడు వ్యాక్సిన్ సామ‌ర్థ్యం, భ‌ద్ర‌త‌పై స‌మీక్షించ‌న‌ట్లే అని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఆనంద్ శ‌ర్మ అన్నారు. మొద‌ట‌గా ఈ వ్యాక్సిన్‌ల‌ను వేసేది దేశంలోని ఆరోగ్య కార్య‌క‌ర్త‌లకే అని, అలాంట‌ప్పుడు త‌ప్ప‌నిస‌రి నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 


logo