జైపూర్: బీజేపీ పాలిత రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి బాన్స్వారా గ్రామంలో ఒక గిరిజన మహిళపై ఆమె భర్త, అతడి తరఫు బంధువులు అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డారు. సాటి మనిషి అనే స్పృహ లేకుండా ఆమెకు గుండు గీసి తీవ్రంగా అవమానించారు. ఆపై వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియో గురువారం వెలుగులోకి రావటంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. సెప్టెంబర్ 1న జరిగిన ఈ ఘటనలో బాధితురాలి భర్త సహా 10 మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. మరొక గ్రామానికి చెందిన వ్యక్తితో పారిపోయిందన్న ఆరోపణతో ఆమె భర్త, అతడి బంధువులు, ఇతరులు బాధితురాలిపై ఈ దారుణానికి ఒడిగట్టారని తెలిసింది. బాధితురాలు తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ గుంపు ఆమెను వదిలిపెట్టలేదు. చాలామంది గ్రామస్థులు ఈ ఘటన పట్ల ప్రేక్షకపాత్ర వహించారు. కొంతమంది తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు.