శ్రీనగర్: ఒక గ్రామం కుంగిపోతున్నది. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్డు రెండుగా చీలింది. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. (J&K Village Sinks) జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం కలబన్ గ్రామంలోని చాలా ప్రాంతం కుంగిపోయింది. కొన్ని ఇళ్లులు, షాపులు కూలిపోయాయి. కలబన్ను జిల్లా కేంద్రంతో కలిపే రహదారి రెండుగా చీలిపోయింది. మిగిలిన ప్రాంతం నుంచి ఆ గ్రామం వేరు అయ్యింది. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
కాగా, రాజౌరి డిప్యూటీ కమిషనర్ అభిషేక్ శర్మ, రెవెన్యూ అధికారుల బృందంతో కలిసి కలబన్ గ్రామానికి చేరుకున్నారు. భూమి కుంగిపోవడం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మూడు ఇళ్లు కూలిపోగా మరికొన్నింటికి తీవ్రమైన పగుళ్లు ఏర్పడి నివాసయోగ్యంగా లేనట్లు గుర్తించారు. అనేక నిర్మాణాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు గమనించారు. నష్టాల తీవ్రతను అంచనా వేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు వారం కిందట తొలిసారి కొండచరియలు విరిగిపడటంతో గ్రామంలో భూమి కుంగిపోవడం ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా కొనసాగుతున్నది. దీంతో వందలాది ఎకరాల సారవంతమైన భూమిని గ్రామస్తులు కోల్పోయారు. 12కు పైగా ఇళ్లులు ధ్వంసమయ్యాయి.
అయితే జాతీయ రహదారి నిర్మాణం చేపట్టడం వల్లే తమ గ్రామం కుంగిపోతున్నదని గ్రామస్తులు ఆరోపించారు. రోడ్డు కోసం భూమిని తవ్వడానికి భారీ యంత్రాలను ఉపయోగించడం వల్ల మట్టి వదులై భూమి కుంగుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం నివసించడానికి ప్రమాదకరంగా మారిందని వాపోయారు. వర్షా కాలంలో భూమి మరింతగా కుంగవచ్చని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారం అందించాలని, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.