అలీఘఢ్: కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని అలీఘఢ్‌కు చేరుకుంది. అక్కడి ఒక విద్యా సంస్థ హిజాబ్ ధరించిన విద్యార్థుల ప్రవేశాన్ని నిషేధించడంతో కలకలం చెలరేగింది. కాలేజీ యాజమాన్యం నిర్దేశించిన యూనిఫాం ధరించని విద్యార్థులను కాలేజీలోకి రాకుండా అక్కడి సిబ్బంది అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది.
అలీఘఢ్‌లోని శ్రీవర్ష్ణే కళాశాల యాజమాన్యం క్యాంపస్‌లోకి నిర్దేశిత యూనిఫాం ధరించకుండా వచ్చే విద్యార్థుల ప్రవేశాన్ని నిషేధిస్తూ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముఖానికి హిజాబ్ ధరించి వచ్చిన ముస్లిం బాలికలను కాలేజీ సిబ్బంది ప్రవేశ ద్వారం వద్ద అడ్డుకున్నారు. బాలికలు ఎంతగా వేడుకున్న కాలేజీ క్యాంపస్‌లోకి అనుమతించకపోవడంతో ఆందోళనకు దిగారు. అక్కడే బైఠాయించారు. కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ వర్గానికి చెందిన బాలికలను కాలేజీలోకి అనుమతించడంలేదని తెలుసుకున్న కొందరు కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. హిజాబ్ ధరించిన విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు.
క్యాంపస్‌లోకి ప్రవేశిస్తుండగా బురఖాను తొలగించాలని కళాశాల అధికారులు తొలుత అడిగారని, ఆ తర్వాత హిజాబ్‌ను కూడా తొలగించాలని చెప్పారని బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని తెలిపారు.
మేం ధరించే హిజాబ్‌తో వారికేం సమస్యో చెప్పాలన్నా వినిపించుకోలేదని చెప్పారు. ఈ నోటీసును గత వారం క్రితమే ఇచ్చామని, కాలేజీలో డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని
కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బీనా ఉపాధ్యాయ స్పష్టం చేశారు.
కాలేజీ ప్రాస్పెక్టస్‌లో డ్రెస్ కోడ్ స్పష్టంగా పేర్కొన్నామని కళాశాల ప్రొక్టర్ అనిల్ వర్ష్నేని వెల్లడించారు. విద్యార్థులు కళాశాల నియమాలు, నిబంధనలను మాత్రమే పాటించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. డ్రెస్ కోడ్లను సీరియస్‌గా అమలు చేయాలని యాజమాన్యం చెప్పిన విధంగానే నడుచుకుంటామని ఆయన తెలిపారు.