Jantar Mantar : ఎర్రకోట, ఇండియా గేట్, రాష్ట్రపతి నిలయం.. ఇలా ఢిల్లీలో చూడదగ్గ ఎన్నో ప్రదేశాలున్నా జంతర్ మంతర్ (Jantar Mantar) మాత్రం చాలా ప్రత్యేకం. 18వ శతాబ్దంలో నిర్మితమైన దీని అసలు ఉద్దేశం ఒకటైతే.. ఇప్పుడు నిరసనకారులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దేశంలో ఎక్కడ లొల్లి పుట్టినా.. తెగని సమస్య వచ్చి పడినా ఇక్కడ కూర్చోవాల్సిందే. ఒకప్పుడు ఖగోళ అధ్యయన కేంద్రంగా పేరొందిన ఈ ప్రాంతం.. కొన్నాళ్లుగా ఉద్యమాలకు, ధిక్కార స్వరాలకు ఆయువుపట్టులా నిలుస్తోంది. నీట్(NEET) ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యతగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో మరోసారి వార్తల్లోకెక్కిందీ జంతర్ మంతర్. సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) ఫాస్టింగ్.. ఛలో పార్లమెంట్ తదనంతర పరిణామాలతో అధికార వర్గానికి చెమటలు పట్టించింది ప్రాంతం.
దేశప్రజలను ఇబ్బంది పెట్టే ఏ సమస్య అయినా ఢిల్లీలో వినిపించాలన్నా.. ప్రభుత్వ పెద్దలకు సెగ తాకాలన్నా జంతర్ మంతర్‌లో పాగా వేయాల్సిందే. నిరుద్యోగులు, ప్రతిపక్ష నాయకులు, దగా పడ్డవారు.. ప్రభుత్వ నిర్ణయాలతో నష్టపోయే రాష్ట్రాలు ఆశ్రయించే నిరసనల వేదిక ఈ ప్రాంతం. 1993 నుంచి ఉద్యమాలకు కేరాఫ్‌గా ఉంటూ బాధితుల పక్షాన నిలుస్తోంది జంతర్ మంతర్.
తాజాగా నీట్ ప్రశ్నాపత్ర లీకేజీకి జవాబుదారీతనం కోరుతున్న కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ అమరణ నిరాహార దీక్షకు పూనుకోవడంతో మళ్లీ ఈ స్థలం నిరసనల గళాలతో నిండిపోయింది.

మొదట్లో ఇండియా గేట్ సమీపంలోని ‘బోట్ క్లబ్’ (Boat Club)లో నిరసనలకు అనుమతించేవారు. అయితే.. 1988లో రైతులు భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించడంతో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఇలాంటి ధర్నాలు, నిరసన ప్రదర్శనలను అక్కడ బంత్ చేసిన ప్రభుత్వం 1993లో అధికారికంగా జంతర్ మంతర్‌ను ధర్నా చౌక్‌గా గుర్తించింది. ఇక అప్పటి నుంచి ఎన్నో పోరాటాలకు వేదికైందీ ప్రాంతం.

ఇప్పుడంటే ఆధునాతన పరికరాలు వచ్చాయి గానీ, మొదట్లో ఖగోళ శాస్త్రాన్ని గణిత శాస్త్రం, క్యాలెండర్స్, రోజూవారీ జీవితంలోని సంఘటనలతో ముడిపెట్టి చూసేవాళ్లు. దాంతో, వ్యోమగాములకు ఖగోళ వస్తువుల కదలికలు, సమయాన్ని సరిగ్గా లెక్కించడంతో పాటు సూర్యడు, చంద్రుడు, గ్రహాల స్థానాలను తెలుసుకోవడానికి ఉపకరించేలా.. జంతర్ మంతర్‌ను నిర్మించారు. జైపూర్‌కు చెందిన మహారాజా స్వామి జై సింగ్ హయాంలో 1724లో ఈ ఖగోళ అధ్యయన కేంద్రానికి రూపమొచ్చింది. జైపూర్, ఉజ్జయిని, వారణాసి, మధురలో కూడా ఆయన ఇలాంటి నాలుగు అధ్యయన కేంద్రాలను నిర్మించారు.
Maharaja Sawai Jai Singh II of Jaipur – the man who built Jantar Mantar.
A visionary,an astronomer & town planner who built the observatory so ppl can learn astronomy & town planning.
His soul must be rolling & spinning to see it taken over by ‘Cockroaches’ and anti-nationals. pic.twitter.com/MR9je1TrKy
— mukesh vig (@vigmukesh) July 20, 2026
జంతర్ మంతర్‌లోని ‘సామ్రాట్ యంత్ర’ సూర్యుడి కదలికల ఆధారంగా సమయాన్ని సూచించేది. ‘జై ప్రకాశ్ యంత్ర’ విషయానికొస్తే.. ఖగోళ వస్తువల అధ్యయనంలో కీలకమైంది. నక్షత్రాలతో పాటు అంతరిక్షంలోని భారీ వస్తువుల దూరం, దిశను తెలుసుకునేందుకు ‘రామ్ యంత్ర’ ఉపయోగపడేది. జియోమెట్రిక్ ఆకారం.. వంపులు తిరిగిన గోడలు, పలు రాతి నిర్మాణాలు చూసిన వారంతా జంతర్ మంతర్‌ను ఆధునిక శిల్పకళ అద్భుతంగా వర్ణిస్తారు.