హైదరాబాద్ : తెలంగాణ సమస్యల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తెస్తూ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని పోరాటాల ద్వారా నిలదీస్తూనే ఉంటామని ఎంపీ , బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ( MP Ravichandra ) స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ( AP Reorganization ) లో పెండింగ్‌లో ఉన్న తెలంగాణ ( Telangana ) అంశాలను పార్లమెంట్ వేదికగా నిలదీస్తామన్నారు.
ఏపీకి నిధులు ఇచ్చినట్లే, తెలంగాణకు కూడా సాయమందించి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించే వరకు తమ పోరాటం ఆగదని వెల్లడించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన అన్ని రకాల బకాయిలను వసూలు చేసేందుకు వెంటబడి సాధిస్తామని ధీమాను వ్యక్తం చేశారు.
ఖాళీ అవుతున్న రిజర్వాయర్లు
రాష్ట్రంలోని రిజర్వాయర్లలో కనీసం 25 నుంచి 30 శాతం వరకు ప్రభుత్వం నీటి నిల్వలు ఉంచకపోగా, కాళేశ్వరం నీటిని సముద్రంపాలు చేయడం వల్ల హైదరాబాద్‌తో సహా రాష్ట్రమంతటా తీవ్ర తాగునీటి ఎద్దడి వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం పంపులు ఆన్ చేసి నీటిని నింపాలని రైతులు, రిటైర్డ్ ఇంజనీర్ల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నదని గుర్తు చేశారు.
ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీ పునరుద్ధరణ ద్వారా దాదాపు 6వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని బీఆర్ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి వివరించారని పేర్కొన్నారు. సున్నపురాయి గనుల లీజును క్రమబద్దీకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ ఇస్తే ఈ ప్రక్రియ వేగవంతమవుతుందని ఎంపీ పేర్కొన్నారు.
కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో బంగారు తెలంగాణ
భారత రాష్ట్ర సమితి రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా గడిచిన పదేళ్లలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో బంగారు తెలంగాణగా మార్చి అద్భుతమైన పాలన అందించారని చెప్పారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగం స్వరూపమే పూర్తిగా మారిపోయి గొప్పగా అభివృద్ధి చెందిందన్నారు. గతంలో కేవలం 35 లక్షల టన్నులుగా ఉన్న ధాన్యం ఉత్పత్తిని 3 కోట్ల టన్నులకు పెరిగిందని ఎంపీ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారులను ఆశ్రయించి, కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరలకు అమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం వద్ద ముందస్తు ప్రణాళికలు లేకపోవడమే ఇందుకు కారణమని అన్నారు.
బీఆర్ఎస్ నేతృత్వంలో సీసీఐ ఫ్యాక్టరీ తెరుచుకునే వరకు పోరాడతామని వివరించారు. సింగరేణి సమస్యలు, థర్మల్ ప్రాజెక్టుల పునరుద్ధరణ, బొగ్గు ఉత్పత్తి పెంపు, తాడిచర్ల-2 మైన్ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రజల సమస్యలపై దృష్టి సారించాలన్నారు. . తెలంగాణ భవిష్యత్తు, పురోగతి బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని వద్దిరాజు వెల్లడించారు.