గువహటి : మహాభారతంలోనూ లవ్ జిహాద్ (Love Jihad) జరిగిందని అసోం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ బోరా చేసిన వ్యాఖ్యలపై సీఎం హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు అర్జునుడు మహిళ వేషంలో వచ్చాడని, మహాభారతంలోనూ లవ్ జిహాద్ ఉందని బోరా విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి.
బోరా ప్రకటన ఖండనార్హమని ఇది సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉందని అసోం సీఎం శర్మ ఆక్షేపించారు. కృష్ణుడు, రుక్మిణిలను వివాదంలోకి లాగడం తగదని హితవు పలికారు. తాము ఏ వివాదంలోకి హజ్రత్ మహ్మద్, జీసస్ క్రీస్తును లాగడం లేదని, అదే తరహాలో మీరు కృష్ణుడిని వివాదంలోకి లాగవద్దని కోరారు. నేర కార్యకలాపాలతో దేవుడుని పోల్చడం సరైంది కాదని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు.
దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఈ వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేస్తామని, సనాతన మతానికి చెందిన వేలాది మంది ఫిర్యాదులు చేస్తే ఇక ఆయనను తాను కాపాడలేనని బోరాను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. మహాభారతాన్ని ప్రస్తావిస్తూ బోరా చేసిన వ్యాఖ్యలను శర్మ ఉటంకించారు. రుక్మిణిని తన మతం మార్చుకోవాలని కృష్ణుడు ఎన్నడూ ఒత్తిడి చేయలేదని గుర్తుచేశారు. తప్పుడు గుర్తింపుతో బాలికను పెండ్లి చేసుకుని ఆపై బలవంతంగా ఆమె మతం మార్చడం లవ్ జిహాద్ కిందకు వస్తుందని అన్నారు.
Read More :
Elon Musk | ట్వీట్‌కు బదులు ‘X’ వాడాలని ఎలాన్ మస్క్ రిక్వెస్ట్.. ఆ అక్షరంపై అంత పిచ్చి ఎందుకో..