సిమ్లా: టాప్ బ్యూరోక్రాట్ హోలీని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. 75 మంది అతిథులకు విందు ఇచ్చాడు. హోలీ వేడుక కోసం రూ.1.22 లక్షలు ఖర్చు చేశాడు. (top bureaucrat’s Holi bash) ఈ మొత్తం చెల్లించాలంటూ ఆ బిల్లును ప్రభుత్వానికి పంపాడు. దీంతో ఆ ఐఏఎస్ అధికారిపై విమర్శలు వెల్లువెత్తాయి. హిమాచల్ ప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రబోధ్ సక్సేనా హోలీని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు. హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే సిమ్లాలోని ప్రభుత్వ హాలిడే హోమ్ హోటల్లో కొందరికి ప్రైవేట్ పార్టీ ఏర్పాటు చేశాడు.
కాగా, హోలీ పార్టీలో సుమారు 75 మంది అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నట్లు చీఫ్ సెక్రటరీ ప్రబోధ్ సక్సేనా తెలిపారు. 75 మంది అతిథులకు భోజనానికి ఒక్కో ప్లేటుకు రూ.1,000 చొప్పున రూ.75,000. జీఎస్టీ ఛార్జీ రూ.22,350ను బిల్లులో పేర్కొన్నాడు. అలాగే అధికారుల డ్రైవర్లకు మధ్యాహ్న భోజనం కోసం రూ.12,870 ఖర్చు చేసినట్లు అందులో ప్రస్తావించాడు. మొత్తం రూ.1.22 లక్షల ఖర్చును చెల్లించాలంటూ ఆ బిల్లును ప్రభుత్వానికి పంపాడు.
మరోవైపు ఈ బిల్లు కాపీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రజా ధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ బిల్లు చెల్లించాలా వద్దా అన్న డైలమాలో ప్రభుత్వం పడింది. 1991 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన ప్రబోధ్ సక్సేనా మార్చి 31న పదవీ విరమణ చేయాల్సి ఉన్నది. అయితే అదే రోజున చీఫ్ సెక్రటరీగా ఆయనను ఆరు నెలల పాటు పొడిగించారు.