ధర్మశాల: హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు క్రిపాల్ పర్మార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను హిమాచల్‌ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సురేష్ కశ్యప్‌కు పంపించారు. నేను క్రిపాల్ పర్మార్‌ను. హిమాచల్‌ప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడిని. నేను పార్టీ పదవి నుంచి తప్పుకుంటున్నాను. దయచేసి నా రాజీనామాను ఆమోదించండి. రాజీనామాకు గల కారణాలను వేరే లేఖల ద్వారా తెలియజేస్తాను అని తన రాజీనామా లేఖలో పర్మార్ పేర్కొన్నారు.
కాగా, హిమాచల్‌ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశాలకు కొన్ని రోజుల ముందు ఉపాధ్యక్షుడు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. బీజేపీలో గత నాలుగు సంవత్సరాలుగా తనను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఈ అవమానాన్ని ఎక్కువ కాలం భరించలేనని, అందుకే తాను పదవి నుంచి తప్పుకుంటున్నానని పర్మార్ చెప్పారు. అయితే, పార్టీ కార్యకర్తగా మాత్రం కొనసాగుతానని ఆయన తెలిపారు.