By polls | దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 29 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్‌సభ స్థానాలకు శనివారం జరిగిన ఉప ఎన్నికల పోలింగ్‌లో భారీ ఓటింగ్ నమోదైంది. కేంద్ర వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా హర్యానాలో అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసిన ఐఎన్ఎల్డీ నేత అభయ్ చౌతాలా, హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్ తదితరులు పోటీలో ఉన్న ప్రముఖులు. ఓటింగ్ కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రశాంతంగా ముగిసింది. అభయ్ చౌతాలా పోటీ చేసిన ఎలనాబాద్ అసెంబ్లీ స్థానంలో 80 శాతం పోలింగ్ జరిగింది.
దాద్రా అండ్ నగర్ హవేలీ లోక్‌సభ స్థానంలో 75.51 శాతం పోలింగ్ జరిగింది. ఏడు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మోహన్ దెల్కర్ మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో శివసేన అభ్యర్థిగా ఆయన భార్య కలాబెన్ దెల్కర్ పోటీ చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మండి లోక్‌సభా స్థానం నుంచి ప్రతిభా సింగ్ పోటీలో ఉన్నారు. మండిలో కేవలం 49.83 శాతం పోలింగ్ జరిగింది. మండి ఎంపీ రాం స్వరూప్ శర్మ (బీజేపీ) మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఫతేపూర్, అర్కీ, జుబ్బాల్-కొత్ఖాయిల్లో 62.4 శాతం, 61.33, 66.1 శాతం పోలింగ్ జరిగింది. వచ్చే ఏడాది హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది.
మధ్యప్రదేశ్ ఖండ్వా లోక్‌సభ స్థానానికి జరిగిన పోలింగ్‌లో 63.88 శాతం మంది ఓటేశారు. అసోంలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో 69.60 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమబెంగాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు సుమారు 71 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు 49.60 శాతం పోలింగ్ రికార్డైంది. రాజస్థాన్‌లో రెండు స్థానాలకు సగటున 70 శాతం, కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు 56.78 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.