Bishop Conrad School | ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో క్రిస్మస్ పర్వదినం వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కంటోన్మెంట్ ప్రాంతంలోని ప్రముఖ బిషప్ కాన్రాడ్ స్కూల్ (Bishop Conrad School) ప్రాంగణంలో ఉన్న చర్చి వెలుపల బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ (VHP)కి చెందిన సభ్యులు నిరసనకు దిగారు. పోలీసుల సమక్షంలోనే చర్చి ఎదుట బైఠాయించి హనుమాన్ చాలీసా పఠించడం స్థానికంగా సంచలనం రేపింది. బరేలీలోని బిషప్ కాన్రాడ్ పాఠశాల ఆవరణలో ఉన్న చర్చి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న విశ్వహిందూ పరిషత్ (VHP) కార్యకర్తలు చర్చి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి హనుమాన్ చాలీసా చదివారు. ఈ సందర్భంగా ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. చర్చిలో ప్రార్థనల సాకుతో అక్రమంగా మత మార్పిడులు చేస్తున్నారని, దీనిపై తాము నిరసన తెలుపుతున్నామని బజరంగ్ దళ్ ప్రతినిధులు పేర్కొన్నారు. చర్చి లోపల కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే వెలుపల ఈ రకమైన నిరసన చేపట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనా స్థలంలో పోలీసులు ఉన్నప్పటికీ, నిరసనకారులు తమ కార్యక్రమాన్ని కొనసాగించారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు ఉన్నతాధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. నిరసనకారులను సముదాయించి అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. ప్రస్తుతం చర్చి పరిసరాల్లో పోలీసుల పహారా కొనసాగుతోంది.
Bareilly, UP: Bajrang Dal and Vishav Hindu Parishad members sat outside a prominent church (Bishop Conrad school) in the Cantonment area of Bareilly and recited Hanuman Chalisa amid police presence. They raised slogans of Jai Shree Ram as well. pic.twitter.com/uBBMNdYGC9
— Krishna Chaudhary (@KrishnaTOI) December 24, 2025