ఛండీగఢ్: ఎమ్మెల్యే వచ్చినందుకు నిలబడలేదంటూ ఓ ప్రభుత్వ వైద్యుడికి షోకాజ్ నోటీసు జారీ చేసిన హర్యానా ప్రభుత్వ అధికారులపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా సున్నితత్వం లేని, అత్యంత కలవరపరిచే చర్య అని అభివర్ణించింది. వివరాల్లోకి వెళ్తే మనోజ్ అనే ప్రభుత్వ వైద్యుడు కొవిడ్ సమయంలో అత్యవసర విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు.
ఆ సమయంలో ఓ ఎమ్మెల్యే అక్కడికి వచ్చాడు. విధుల్లో ఉన్న డాక్టర్ లేచి నిలబడలేదంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులు సదరు డాక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అందుకు డాక్టర్ సమాధానం ఇచ్చినా ప్రభుత్వం ఆ వ్యవహారాన్ని పెండింగ్‌లో పెట్టింది. ఈ కేసును విచారణ చేసిన ధర్మాసనం డాక్టర్‌కు రూ.50 వేలు జరిమానా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.