న్యూఢిల్లీ: హైకోర్టు అదనపు న్యాయమూర్తులు సహా అందరు న్యాయమూర్తులు పదవీ విరమణ ప్రయోజనాలను, పూర్తి స్థాయి పింఛనును పొందేందుకు అర్హులేనని సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. వారు ఎప్పుడు నియమితులయ్యారు? అదనపు జడ్జి హోదాలో పదవీ విరమణ చేశారా? అదనపు జడ్జిగా నియమితులైన తర్వాత శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారా? అనే అంశాలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా పింఛను, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందాలని స్పష్టం చేసింది.
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు సంవత్సరానికి రూ.15 లక్షలు పింఛను ఇవ్వాలని తెలిపింది. హైకోర్టు అదనపు జడ్జిలు సహా న్యాయమూర్తులకు సంవత్సరానికి రూ.13.50 లక్షల పూర్తి స్థాయి పింఛనును చెల్లించాలని తెలిపింది. దీనిని తిరస్కరిస్తే, సమానత్వ హక్కును ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది. నియామక తేదీ, హోదాను బట్టి న్యాయమూర్తుల పట్ల వివక్ష ప్రదర్శించడం ఈ ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని తెలిపింది.