పుణె, ఆగస్టు 24: మహారాష్ట్రలో శనివారం ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో పుణె జిల్లా ముల్షి తహశీల్ పరిధిలోని కొంద్వాల్ గ్రామ సమీపంలో అదుపుతప్పి కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. పైలట్ సహా మరో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
తీవ్ర గాయాలైన పైలట్‌ను పౌద్ దవాఖానకు తరలించారు. మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని ఓ అధికారి తెలిపారు. డీజీసీఏ బృందం ఘటనాస్థలికి చేరుకొని ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. హెలికాప్టర్ కూలిన ఏరియాలో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని, ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చని పౌద్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ మనోజ్ యాదవ్ పేర్కొన్నారు.
హెలికాప్టర్ గ్లోబల్ వెక్ట్రా ఏవియేషన్ కంపెనీకి చెందినదని తెలిపారు. ముంబై నుంచి బయలుదేరే సమయంలో వాతావరణం బాగానే ఉన్నదని, అయితే పౌద్ ఏరియాకు వచ్చే సరికి ప్రతికూల వాతావరణం ఎదురైందని తెలిపారు. దీంతో హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించగా, సాధ్యం కాక ఒక చెట్టును ఢీకొని నేల కూలిందని వివరించారు.