Mumbai | ముంబై : గడచిన 107 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో ముంబై నగరాన్ని వర్షం ముంచెత్తింది. ఆదివారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానకు అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. రోడ్లు నీట మునిగిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాకులపైకి వర్షపు నీరు చేరడంతో లోకల్ ట్రెయిన్ సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. రెండు వారాల క్రితం ప్రారంభించిన ముంబై మెట్రో అండర్‌గ్రౌండ్ స్టేషన్‌ని వరద నీరు ముంచెత్తడంతో మెట్రో రైలు సర్వీసులు నిలిచిపోయాయి. గడచిన 25 ఏళ్లలో మొట్టమొదటిసారి రుతు పవనాలు ముందుగానే నగరంలోకి ప్రవేశించాయి. ముంబైతోపాటు పొరుగున ఉన్న థాణె, రాయగఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆదివారం రాత్రంతా కురిసిన వర్షానికి కొత్తగా ప్రారంభించిన ఆచార్య ఆత్రే చౌక్ అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్ నీట మునిగింది. మూడు ప్రధాన లైన్లు సెంట్రల్, వెస్టర్న్, హార్బర్లో లోకల్ రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబై విమానాశ్రయంలో 250కి పైగా విమాన సర్వీసులకు అవరోధం ఏర్పడింది.
కేరళలోని ఉత్తర జిల్లాలను భారీ వర్షం ముంచెత్తుతున్నది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు, ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు. త్రిసూర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. త్రిసూర్-గురువాయూర్ రైలు మార్గంపై ఓ భారీ వృక్షం విరిగిపడడంతో దాన్ని తొలగించేందుకు రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెనుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా పాలక్కాడ్ జిల్లాలో అనేక చోట్ల ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆదివారం నుంచి నిర్విరామంగా వర్షం కురుస్తుండడంతో పొరుగున కోజిక్కోడ్ జిల్లాలో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు నదుల ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇడుక్కి, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజిక్కోడ్, వయనాడ్, కన్నూర్ జిల్లాలలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వరుసగా మూడవరోజు కర్ణాటకలోని కోస్తా తీర ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. దక్షిణ కన్నడ జిల్లాలో ప్రజా జీవనం స్తంభించింది. ఆ ప్రాంతాలలో రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. ఐదు రోజుల వరకు రెడ్ అలర్ట్ కొనసాగుతుందని ఐఎమ్‌డీ తెలిపింది. మంగళూరు నగరంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.