HD Kumaraswamy | బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కంటే ఆయన భార్య అనితనే ధనవంతురాలు. మాండ్య ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కుమారస్వామి.. ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తుల వివరాల ప్రకారం ఆయన భార్య అనితనే ధనవంతురాలు అని తేలింది. కుమారస్వామి, అనిత పేర మొత్తం రూ. 217.21 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో రూ. 154.39 కోట్ల ఆస్తులను అనిత కలిగి ఉన్నారు. కుమారస్వామి కేవలం 54.65 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ చట్టం కింద రూ. 8.17 కోట్ల ఆస్తులను కుమారస్వామి కలిగి ఉన్నారు. ఇద్దరు భార్యాభర్తలు కలిసి రూ. 82.17 కోట్ల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు.
కుమారస్వామికి సొంత కారు కూడా లేదట. కానీ రూ. 12.55 లక్షల విలువ చేసే ట్రాక్టర్ ఉందని తెలిపారు. అనితకేమో రూ. 11.15 లక్షల విలువ చేసే కారు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది నిఖిల్ అండ్ కో కంపెనీ తరపున కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రూ. 47.06 లక్షల విలువ చేసే బంగారం, రూ. 2.60 లక్షల విలువ చేసే డైమండ్లు కుమారస్వామి కలిగి ఉన్నారు. రూ. 2.41 కోట్ల విలువ చేసే బంగారం, రూ. 33.09 లక్షల విలువ చేసే డైమండ్లు ఉన్నట్లు అనిత పేర్కొన్నారు. అనిత పేరు మీద రూ. 28.38 కోట్ల విలువ చేసే వ్యవసాయ భూములు ఉన్నాయి. రూ. 35.69 కోట్ల విలువ చేసే కమర్షియల్ బిల్డింగ్స్ కూడా ఆమె కలిగి ఉన్నారు. కుమారస్వామి పేరు మీద రూ. 37.48 కోట్ల విలువ చేసే వ్యవసాయ భూములు ఉన్నాయి.