చండీగఢ్: కేదార్నాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ లైవ్ కార్యక్రమాన్ని చూసేందుకు స్థానిక గుడికి వెళ్లిన బీజేపీ నేతలను రైతులు చుట్టుముట్టి నిర్బంధించారు. హర్యానాలోని రోహ్తక్ జిల్లా కిలోయ్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మాజీ మంత్రి మనీష్ గ్రోవర్‌ను ఆరు గంటలకుపైగా గుడిలో రైతులు నిర్బంధించారు. ఇటీవల ఆయన రైతులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీని కోసం ఆయనకు అర గంట సమయాన్ని రైతులు ఇచ్చారు. పార్టీ సంస్థాగత మంత్రి రవీంద్రరాజు, మేయర్ మన్మోహన్ గోయల్, బీజేపీ జిల్లా చీఫ్ అజయ్ బన్సల్, పార్టీ నాయకుడు సతీష్ నందాల్ కూడా గుడిలో ఉండిపోయారు.
మరోవైపు బీజేపీ నేతలున్న గుడిని చుట్టుముట్టిన రైతులను వెళ్లగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సోనిపట్, ఝజ్జర్ నుంచి అదనపు పోలీస్ బలగాలను రప్పించారు. ఇద్దరు నిరసనకారులను అరెస్ట్ చేశారు. మరింత మంది రైతులు అక్కడకు రాకుండా ఢిల్లీ-హిసార్ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను కూడా నిలిపివేశారు.