Bengaluru | బెంగళూరు, మార్చి 9 : ఒకప్పుడు పచ్చగా కళకళలాడుతూ, స్వచ్ఛమైన వాతావరణంతో ఉద్యాన నగరంగా పేరొందిన బెంగళూరు నేడు ఐటీ రాజధానిగా మారి కాలుష్యం, రణగొణ ధ్వనులతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లతో, అస్తవ్యస్తమైన రోడ్లు, కట్టడాలతో నిండి ఉండటం పట్ల ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమంలో చర్చకు దారి తీసింది. ‘నిర్మల స్వర్గ ధామం నుంచి ట్రాఫిక్ రద్దీతో నిండిన మహా నగరం’గా బెంగళూరు మారిన వైనాన్ని ప్రస్తావిస్తూ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, నందన్ నీలేకని చిత్రాలను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఆయన రాసిన పోస్ట్ ప్రకారం ఒకప్పుడు బెంగళూరు నగరం నిర్మలమైన స్వర్గధామంగా ఉన్నప్పుడు కబ్బన్ పార్కులో ఉదయపు నడకలు, ప్రీమియర్ పద్మినీ కారులో సరదా డ్రైవింగ్‌లు, మధ్యాహ్న సమయాలలో బుక్స్టోర్ల్లో కాలక్షేపాలు, సరదా కబుర్లు ఉండేవి. అయితే కొందరు తెలివైన ఐఐటీయన్లు తమ జీవిత భాగస్వాముల నుంచి కొంత సొమ్ము పట్టుకొచ్చి వెచ్చించారు. దాంతో ఇప్పుడు గార్డెన్ సిటీలో చల్లటి గాలిని ఆస్వాదించడానికి బదులుగా ఔటర్ రింగ్ రోడ్‌పై గంటలు గంటలు ఇరుక్కుపోయి కాలం గడపాల్సి వస్తున్నది.
వారంతా దీనిని అభివృద్ధి అంటున్నారని హర్ష్ గోయెంకా వ్యాఖ్యానించారు. కాగా, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు అనుకూల, వ్యతిరేక కామెంట్లు చేశారు. బెంగళూరులో మౌలిక సదుపాయాలు క్షీణించాయని కొందరు వ్యాఖ్యానించగా, మరికొందరు నగర అభివృద్ధిని, అందులో సాంకేతిక మార్గదర్శకుల పాత్రను ప్రశంసించారు. ‘బెంగళూరు సామర్థ్యం గల నగరం. గత రెండు దశాబ్దాలుగా దాని అభివృద్ధి స్పష్టంగా కన్పిస్తున్నది. ఈ రోజుకు కూడా కొత్త సిటీ కన్నా గార్డెన్ సిటీ లాంటి పాత నగరంలోనే రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి.
సాంకేతికతను నారాయణ మూర్తి అడ్డుకుంటే ఆయనను నిందించగలము కాని.. బెంగళూరులోని దయనీయమైన మౌలిక సదుపాయాలకు ఆయనను నిందించ లేం కదా. రాజకీయ నాయకుల బిల్డర్ లాబీయే దీనికి కారణం. వారు చెరువులు, కుంటలు ఆక్రమించారు. వారు రోడ్లు వేయలేదు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా నగరాన్ని నాశనం చేశారు’ అని ఒక నెటిజన్ విమర్శించారు. ‘బెంగళూరు పరివర్తన నగర పరిణామాలలో ఒక కేస్ స్టడీ. ఇందుకు ఇన్ఫోసిస్, ఐఐటీయన్లకు కృతజ్ఞతలు’ అని మరొకరు వ్యాఖ్యానించారు. అభివృద్ధి, విధ్వంసం పక్క పక్కనే ఉంటాయని.. ఈ రెండూ లేకుండా ఒక్కటే కావాలనుకోవడం అత్యాశే అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.