Udayanidhi Stalin : డీఎంకే (DMK) కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ చేజారబోదని తమిళనాడు (Tamil Nadu) ఉప ముఖ్యమంత్రి (Deputy CM) ఉదయనిధి (Udayanidhi Stalin) అన్నారు. దిండుగల్ సమీపంలోని వేడచెందూర్‌లో శుక్రవారం ఉదయం డీఎంకే ప్రముఖుడు స్వామినాథన్ ఇంట్లో వివాహ వేడుక జరిగింది. ఆ వివాహానికి ఉదయనిధి హాజరై వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఉదయనిధి మాట్లాడుతూ.. అన్నాడీఎంకే ఇప్పటికే బీజేపీకి బానిసలా మారిందని, కొత్త బానిసల కోసం కమలనాథులు వెతుకుతున్నారని వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వ బెదిరింపులకు డీఎంకే ఎప్పటికీ భయపడే ప్రసక్తేలేదని, అదేవిధంగా కూటమిలో ఉన్న మిత్రపక్షాలకు ఇచ్చే గౌరవం కూడా తగ్గబోదని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడున్న డీఎంకే కూటమి అలాగే కొనసాగుతుందని, కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి బయటికెళ్లే ప్రసక్తే లేదని ధీమాగా చెప్పారు.
ఇక అధిక సీట్లు డిమాండ్ చేస్తున్న మిత్రపక్షాలతో డీఎంకే ఎన్నికల నిర్వహణ కమిటీ చర్చిస్తుందని, కూటమి అధ్యక్షుడైన సీఎం స్టాలిన్ మంచి నిర్ణయం తీసుకుంటారని ఉదయనిధి అన్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమే బలమైన కూటమని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి బుధవారం రాత్రి జరిగిన రోడ్‌షోలో వ్యాఖ్యానించారని, వాస్తవానికి ఆ కూటమిలో చేరిన పార్టీలపై ఇప్పటివరకు స్పష్టతలేదని ఎద్దేవా చేశారు.