Haj portal : హజ్ పోర్టల్‌ను పునఃప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా దాదాపు 10 వేల మంది భారతీయులకు అవకాశం కల్పించనున్నారు. కంబైన్డ్ హజ్ గ్రూప్ ఆపరేటర్స్ (CHGO) కోసం హజ్ పోర్టల్‌ను తెరిచినట్లు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంగళవారం వెల్లడించింది. CHGO ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే తన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. పలుమార్లు హెచ్చరించినా ఇటీవల భారత్‌లోని సీహెచ్జీవో వారు మినా క్యాంప్‌లు, బస, ప్రయాణ ఏర్పాట్లకు అవసరమైన కాంట్రాక్టులను పూర్తిచేయడంలో విఫలమయ్యారు.
ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సౌదీ హజ్ మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపింది. దాంతో ఆ శాఖ 10 వేల మందికి అవకాశం కల్పించేలా హజ్ పోర్టల్‌ను తిరిగి తెరిచేందుకు అంగీకరించింది. అంతకుముందు మినాలో ప్రైవేటు ఆపరేటర్లకు కేటాయించిన జోన్లను రద్దు చేస్తూ సౌదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దాంతో దాదాపు 52 వేల మంది భారతీయ యాత్రికుల పరిస్థితి గందరగోళంలో పడింది.
కాగా ఏటా భారత్‌కు కేటాయించిన కోటాలో 70 శాతం మందిని హజ్ కమిటీ ద్వారా, మిగిలిన 30 శాతం మందిని హజ్గ్రూప్ ఆర్గనైజర్స్ ద్వారా పంపిస్తారు. 2025కుగాను భారత్‌కు 1.75 లక్షల కోటాను సౌదీ కేటాయించింది. ఈ క్రమంలో గత వారం కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి చంద్రశేఖర్ కుమార్.. జెడ్డాను సందర్శించి హజ్‌యాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ఏడాది జూన్ 4, 9 తేదీల్లో హజ్‌ను నిర్వహించవచ్చని చెబుతున్నారు. చంద్ర దర్శనం ఆధారంగా జిల్-హజ్ నెల మొదలవుతుంది. ఇస్లామిక్ క్యాలెండర్లో ఇది చివరి నెల.