న్యూఢిల్లీ: హెచ్-1బీ వీసాదారులకు నిజంగా ఇది శుభవార్తే. ఇటీవల తొలగింపునకు గురైన ఉద్యోగులను చాలా అమెరికా కంపెనీలు తమ సంస్థల్లోకి తీసుకోవడం ప్రారంభించాయి. దాంతో ఇటీవల పరిణామాలతో తిరిగి స్వదేశాలకు వెళ్లిపోవాల్సిన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న హెచ్-1బీ వీసా ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ద్రవ్యోల్బణం భయాలతో పలు ప్రముఖ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలా వేల మందిని ఉద్యోగంలోంచి హఠాత్తుగా తీసేయడంతో దేశంలోనే కాక అమెరికా లాంటి దేశాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు కష్టాలు ఎదురయ్యాయి. అమెరికా వీసా నిబంధనల ప్రకారం హెచ్-1బీ వీసాపై ఉన్న వారు ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లో మరో జాబ్లో చేరాలి. లేకపోతే వారి దేశాలకు తిరుగు ప్రయాణం అవ్వాల్సిందే. దాంతో వారంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ సమయంలో వారిని కొత్త కంపెనీలు ఆహ్వానిస్తున్నాయి.