అహ్మదాబాద్/న్యూఢిల్లీ, నవంబర్ 16: మరో రెండు వారాల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా సూరత్ తూర్పు నియోజకవర్గ ఆప్ అభ్యర్థి కంచన్ జరీవాలా కిడ్నాప్ కలకలం రేపింది. అనూహ్య రీతిలో ఆయన బుధవారం తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. తమ అభ్యర్థి కంచన్, ఆయన కుటుంబం మంగవారం నుంచి కనిపించడం లేదని, బీజేపీ కిడ్నాప్ చేసిందని ఆప్ ఆరోపించింది. నామినేషన్‌ను రద్దుకు ప్రయత్నాలు విఫలమవడంతో.. ఉపసంహరణకు బీజేపీ ఆయనపై తీవ్ర ఒత్తిడి చేసిందని ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ బుధవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్న కొద్దిసేపటికే కంచన్ జరీవాలా సూరత్‌లో ప్రత్యక్షమయ్యారు. ఆప్ ఆరోపణలు నిజమనేలా ఆయన నామినేషన్ ఉపసంహరించుకోవడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.
గూండాల మధ్య ఆర్వో వద్దకు తీసుకొచ్చారు..
భారీ బందోబస్తుతో, చుట్టూ బీజేపీ గూండాల మధ్య కంచన్ రిటర్నింగ్ అధికారి ముందు హాజరయ్యారని, బీజేపీ పెట్టిన ఒత్తిడితో నామినేషన్ వెనక్కు తీసుకొన్నారని ఆప్ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా పేర్కొన్నారు. ఆర్వో ఆఫీస్‌కు వచ్చిన సమయంలో కంచన్ జరీవాలాను ప్రశ్నించేందుకు మీడియా ప్రయత్నించగా.. చుట్టూ ఉన్నవారు ఆయన్ను హడావిడిగా అక్కడి నుంచి తీసుకెళ్లడం గమనార్హం. అయితే తన నామినేషన్ ఉపసంహరణ వెనుక ఎటువంటి ఒత్తిడి లేదని పేర్కొంటూ జరీవాలా ఓ వీడియో ప్రకటనను విడుదల చేశారు. ఆప్ నుంచి పోటీచేస్తున్నందున నియోజకవర్గ ప్రజలు తనను దేశ, గుజరాత్ వ్యతిరేకిగా చూస్తున్నారని, అందుకే విత్‌డ్రా చేసుకొన్నానని చెప్పడం పలు అనుమానాలను తావిస్తున్నది. దీనిపై ఆప్ నేత రాఘవ్ చద్దా స్పందిస్తూ.. కంచన్ కు గన్ గురిపెట్టి నామినేషన్ విత్‌డ్రా చేసుకునేలా చేశారని బీజేపీపై ధ్వజమెత్తారు. బెదిరింపులకు గురిచేసి ఆప్‌కు వ్యతిరేకంగా మాట్లాడేలా చేశారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యం కిడ్నాప్: సిసోడియా
ఢిల్లీ మీడియా సమావేశంలో సిసోడియా మాట్లాడుతూ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే తమ పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేయించిందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యం కిడ్నాప్‌నకు గురైనట్టు అభిప్రాయపడ్డారు. అభ్యర్థి మిస్సింగ్‌పై ఫిర్యాదు చేస్తే గుజరాత్ ఎన్నికల ప్రధానాధికారి సరిగా స్పందించలేదని, సీఈవో వ్యవహారశైలి పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నదని పేర్కొన్నారు. ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ముందు సిసోడియా, ఇతర ఆప్ నేతలు ఆందోళన చేపట్టారు. అంతకుముందు సూరత్(తూర్పు) నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ఆప్ అభ్యర్థి మంగళవారం నుంచి కనిపించడం లేదంటూ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బుధవారం ఉదయం ట్వీట్ చేశారు. ఆయన్ను బీజేపీ కిడ్నాప్ చేసిఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు.