లక్నో: పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ (Pak Woman Seema Haider) ఇంట్లోకి ఒక వ్యక్తి చొరబడ్డాడు. ఆమె తనపై చేతబడి చేసిందని ఆరోపించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. గుజరాత్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. ఆమె తనపై చేతబడి చేసిందని ఆరోపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
కాగా, నిందితుడ్ని గుజరాత్‌కు చెందిన తేజస్‌గా పోలీసులు గుర్తించారు. జనరల్ కోచ్ టికెట్‌తో రైలులో ప్రయాణించిన అతడు గుజరాత్ నుంచి ఢిల్లీకి చేరుకున్నాడని తెలుసుకున్నారు. అక్కడి నుంచి బస్సులో నోయిడాకు వచ్చి సీమా హైదర్ ఇంటికి వెళ్లాడని పోలీస్ అధికారి తెలిపారు. అతడి మొబైల్ ఫోన్లో సీమా హైదర్ ఫొటో స్క్రీన్ షాట్ ఉందని చెప్పారు. అతడ్ని ప్రశ్నించగా ఆమె తనపై చేతబడి చేసినట్లు ఆరోపించాడని అన్నారు. ఆ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేనట్లుగా తెలుస్తున్నదని పోలీస్ అధికారి వెల్లడించారు.
మరోవైపు పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్‌లోని జాకోబాబాద్‌కు చెందిన 32 ఏళ్ల సీమా హైదర్ 2023 మేలో తన పిల్లలతో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. నేపాల్ మీదుగా భారత్‌కు అక్రమంగా చేరుకున్నది. గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల సచిన్ మీనాతో కలిసి నివసిస్తున్నది. హిందూ మతంలోకి మారి అతడ్ని పెళ్లి చేసుకున్నట్లు ఆమె చెప్పింది. 2023 జూలైలో ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నది. అయితే పాకిస్థానీ భర్త గులాం హైదర్ ద్వారా నలుగురు పిల్లలున్న సీమా హైదర్, సచిన్ ద్వారా ఒక కుమార్తెకు జన్మనిచ్చింది.