Mevani gets 3 Months Jail | ఐదేండ్ల క్రితం అనుమతి లేకుండా ఆజాదీ మార్చ్ నిర్వహించినందుకు గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీతోపాటు తొమ్మిది మందికి మూడు నెలల జైలుశిక్ష పడింది. జిగ్నేశ్ మేవానీతోపాటు ఎన్పీసీ ప్రతినిధి రేష్మా పటేల్, మేవానీ రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ సభ్యులు కొందరు చట్ట విరుద్ధంగా సమావేశమయ్యారని అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ జేఏ పర్మార్ తెలిపారు. వీరిపై ఐపీసీలోని 143 సెక్షన్ ప్రకారం వారు చట్ట విరుద్ధంగా సమావేశమైనట్లు పేర్కొన్నారు. మేవానీతోపాటు 10 మందికి ఒక్కొక్కరిపై రూ.1000 విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
బనస్కాంత జిల్లాలో మేహ్సానా నుంచి ధనేరా వరకు 2017 జూలైలో అనుమతి లేకుండా ఆజాదీ మార్చ్ నిర్వహించారని మెహ్సానీ డివిజన్ పోలీసులు ఐపీసీ 143 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. మొత్తం ఈ కేసులో 12 నిందితులు ఉండగా, వారిలో ఒకరు మరణించగా, మరొక వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. రేష్మా పటేల్ గతంలో పాటిదార్ కమ్యూనిటీకి రిజర్వేషన్ ఆందోళనకు మద్దతుదారు. ప్రస్తుతం ఏ రాజకీయ పార్టితో ఆమె సంబంధం లేదు.