న్యూఢిల్లీ: మోదీ పాలనలో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ మసకబారుతున్నది. చాలా దేశాల్లో ప్రజలు భారత్ అంటే వ్యతిరేకతను కనబరుస్తున్నారు. ప్యూ రిసెర్చ్ సెంటర్ నిర్వహించిన తాజా సర్వేతో ఈ విషయం స్పష్టవుతున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 9 నుంచి మే 13 మధ్య 36 దేశాల్లో 42,092 మందిని సర్వే చేయగా సగటున 45 శాతం మంది భారత్‌పై అనుకూల, 41 శాతం మంది ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానంగా అమెరికాలో భారత్‌కు అనుకూలంగా ఉన్న అభిప్రాయం గత కొన్నేండ్లతో పోలిస్తే తగ్గినట్టు సర్వే తెలిపింది.
45 శాతం మంది అమెరికన్లు భారత్‌ను సానుకూలంగా చూడగా 50 శాతం మంది ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. 2023లో భారత్‌పై అనుకూల అభిప్రాయం 51 శాతం ఉండగా, తాజా సర్వేలో అది 45 శాతానికి పడిపోయింది. వృద్ధులతో పోలిస్తే యువ అమెరికన్లు భారత్‌పై మరింత విమర్శనాత్మకంగా ఉన్నారు. 65 ఏండ్లు అంతకంటే ఎక్కువ వయసున్న అమెరికన్లలో సగం (50%) మంది భారత్‌ను అనుకూలంగా చూస్తున్నారు. దీనికి విరుద్ధంగా 18 నుంచి 29 ఏండ్ల యువతలో 56% మంది భారత్‌పై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్‌లో కూడా భారత్‌పై అనుకూల అభిప్రాయం తగ్గినట్టు సర్వే వెల్లడించింది. భారత్‌ను అనుకూలంగా చూసేవారి శాతం 57 నుంచి 42కు తగ్గింది. పాకిస్థాన్‌లో కేవలం 7 శాతం మంది మాత్రమే భారత్‌పై అనుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆసియా దేశాల్లో భారత్‌పై అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. జపాన్, థాయ్‌లాండ్‌లో 55 శాతం మంది భారత్‌ను అనుకూలంగా చూశారు. సింగపూర్‌లో 51 శాతం, ఇండోనేషియాలో 50, ఫిలిప్పీన్స్‌లో 49, దక్షిణకొరియాలో 44 శాతం మంది భారత్‌కు అనుకూలంగా ఉన్నారు. తుర్కియేలో 72% మంది భారత్‌ను ప్రతికూలంగా చూస్తుండగా కేవలం 15% మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు. ఇక 60% మంది ఇజ్రాయెల్ ప్రజలు భారత్‌పై సానుకూల అభిప్రాయం కలిగి ఉన్నారు. భారత్‌పై అత్యంత సానుకూల అభిప్రాయం(79 శాతం) శ్రీలంకలో నమోదైంది. బ్రిటన్‌లో 71 శాతం, కెన్యాలో 71 శాతం, జర్మనీలో 63, ఇటలీలో 56, జపాన్‌లో 55 శాతం మంది భారత్‌ను అనుకూలంగా చూశారు.
భారత్ ఆర్థిక వృద్ధి, దౌత్య సంబంధాలు, ప్రపంచ వ్యవహారాల్లో పెరుగుతున్న పాత్ర కారణంగా అనేక దేశాల్లో గుర్తింపు పొందుతున్నది. అయితే కొన్ని దేశాల్లో రాజకీయ, సామాజిక కారణాల వల్ల ప్రతికూల అభిప్రాయాలు కూడా పెరుగుతున్నాయి. ప్యూ రిసెర్చ్ సర్వే ప్రకారం.. భారత్ ప్రపంచ ప్రతిష్ట ఒకే దిశలో కాకుండా కొన్ని ప్రాంతాల్లో బలపడుతూ, మరికొన్ని ప్రాంతాల్లో సవాళ్లను ఎదుర్కొంటూ కనిపిస్తున్నది. బ్రిటన్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాలను విజయవంతంగా ఆకర్షిస్తున్నప్పటికీ, అత్యంత కీలకమైన భాగస్వామి దేశమైన అమెరికాలో తీవ్రమైన ప్రజాభిప్రాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. 18-29 ఏండ్ల వయస్సు గల యువ అమెరికన్లు భారత్‌పై విమర్శనాత్మకంగా ఉండటం ద్వైపాక్షిక సంబంధాలకు భవిష్యత్తులో తీవ్ర సవాలుగా మారే అవకాశం ఉన్నది.
అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠ దిగజారడానికి మోదీ సర్కార్ దౌత్య వైఫల్యమే కారణమని విశ్లేషకులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మిత్రదేశాలు కూడా భారత్‌కు క్రమంగా దూరమవుతున్నాయని వారు ఎత్తిచూపుతున్నారు. అమెరికాతో సంబంధాలు కూడా క్షీణించాయని గుర్తు చేస్తున్నారు. బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలతోనూ సంబంధాలు దిగజారడాన్ని ప్రస్తావించారు. ప్రధాని మోదీ విస్తృతంగా విదేశీ పర్యటనలు చేస్తున్నా దౌత్య సంబంధాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు.