సిమ్లా: వరుడు తన కుటుంబం, బంధువులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి జరిగే గ్రామానికి చేరుకున్నాడు. అయితే అక్కడ ఎలాంటి పెళ్లి ఏర్పాట్లు లేకపోవడం చూసి షాక్ అయ్యాడు. (Groom Stunned As No Wedding) వధువు ఫొటో గ్రామస్తులకు చూపించగా ఆమె ఎవరో తెలియదని చెప్పాడంతో వరుడి కుటుంబం కంగుతున్నది. విస్తూపోయే ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో జరిగింది. జనవరి 28న నారి గ్రామానికి చెందిన పెళ్లి బృందం వివాహం కోసం సింగా గ్రామానికి చేరింది. అయితే అక్కడ ఎలాంటి పెళ్లి ఏర్పాట్లు లేకపోవడం చూసి వారు ఆశ్చర్యపోయారు.
కాగా, వరుడి కుటుంబం వధువు ఫొటోను గ్రామస్తులకు చూపించారు. అయితే అలాంటి అమ్మాయి లేదా ఆమె కుటుంబం తమ గ్రామంలో లేరని చెప్పడంతో వారు షాక్ అయ్యారు. అయితే పెళ్లి కుమార్తెను తీసుకొస్తానంటూ మధ్యవర్తిగా వ్యవహించిన మను అనే మహిళ కారులో అక్కడి నుంచి జారుకున్నది.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ పెళ్లికి మధ్యవర్తిత్వం వహించిన వరుడి ఇంటి పొరుగున ఉండే రాజీవ్, మను దంపతులు రూ.50,000 తీసుకున్నారని, అమ్మాయిని నేరుగా చూపించకుండా ఫోన్లో మాట్లాడించి పెళ్లి సంబంధం కుదిర్చినట్లు వరుడి కుటుంబం ఆరోపించింది.
కాగా, మధ్యవర్తి రాజీవ్‌ను పోలీసులు ఫోన్లో సంప్రదించగా వధువు ఏదో విషం తాగిందని, పంజాబ్‌లోని నవాన్షహర్ ఆసుపత్రికి ఆమెను తరలించినట్లు అతడు చెప్పాడు. దీంతో వరుడి కుటుంబం అనుమానించారు. మను కోసం వెతికి ఆమెను పట్టుకుని ఆ గ్రామానికి తీసుకువచ్చారు.
అయితే ఈ వివాదాన్ని వారే పరిష్కరించుకోవాలని లేదా పెళ్లి మధ్యవర్తులపై ఉనా సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని వరుడి కుటుంబానికి పోలీసులు సూచించారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన పెళ్లి బృందం తమ గ్రామానికి తిరిగి వెళ్లింది.