లక్నో: పెళ్లికి ముందు వరుడు అదృశ్యమయ్యాడు. (Groom Missing Before Wedding) పోలీసుల జోక్యంతో పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. అయితే అతడికి మరో మహిళతో సంబంధం ఉందని వధువు కుటుంబ సభ్యులు అనుమానించారు. దీంతో పెళ్లి రద్దు చేశారు. పెళ్లి ఏర్పాటు ఖర్చులు చెల్లించాలంటూ వరుడ్ని నిర్బంధించారు. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో ఈ సంఘటన జరిగింది. అయోధ్యకు చెందిన సోహన్లాల్ యాదవ్, పెళ్లికి మూడు రోజుల ముందు అదృశ్యమయ్యాడు. దీంతో అతడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోహన్లాల్ ఆచూకీని గుర్తించిన పోలీసులు అతడ్ని పోలీస్ స్టేషన్కు రప్పించారు.
కాగా, ఈ విషయం తెలియని వధువు కుటుంబ సభ్యులు మంగళవారం పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయ్యారు. పెళ్లి కోసం వరుడు రాకపోవడంతో ఆందోళన చెందారు. చివరకు అతడు పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడకు వెళ్లారు. పోలీసుల హెచ్చరికతో పెళ్లికి ఒప్పుకున్న వరుడు అర్ధరాత్రి వేళ పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. అప్పటికే పెళ్లికి వచ్చిన బంధువులంతా వెళ్లిపోయారు.
మరోవైపు వరుడు సోహన్లాల్ యాదవ్కు మరో మహిళతో సంబంధం ఉందని, అందుకే అతడు పెళ్లికి ఇష్టపడంలేదని తెలిసిన వధువు కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేశారు. వరుడు భోజనం చేసిన తర్వాత కారులో ఉన్న అతడ్ని నిర్బంధించారు. పెళ్లి ఏర్పాటు కోసం అయిన ఖర్చులను చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకున్నప్పటికీ వారు పట్టువీడలేదు. పెళ్లి ఖర్చులను చెల్లిస్తేనే అతడ్ని విడిచిపెడతామని స్పష్టం చేశారు.