న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్న విదేశీయులు అక్టోబర్ 20 నుంచి అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్ఐసీఎస్) కొత్త విధాన ం కింద కఠినమైన నిబంధనలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇకపై దరఖాస్తుదారులు పౌర విధులకు సంబంధించిన ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. వారి వ్యక్తిగత ప్రవర్తననూ నిశితంగా పరిశీలిస్తారు.ఎన్-400 ఫారాన్ని దాఖలు చేసిన విదేశీయులకు 2025 నేచురలైజేషన్ (సహజీకరణ) (పౌరసత్వ) పౌర శాస్త్ర పరీక్షను అక్టోబర్ 20న లేక ఆ తర్వాత నిర్వహిస్తామని యూఎస్ఐసీఎస్ తన వెబ్సైట్లో ప్రకటించింది. ఈ పరీక్ష మౌఖికంగా ఉంటుంది. 128 ప్రశ్నల జాబితాలో 20 ప్రశ్నలు మౌఖిక పరీక్షలో ఉంటాయి.
పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే దరఖాస్తుదారులు 12 ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. 20 ప్రశ్నలలో 9 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా చెబితే పరీక్షలో ఫెయిల్ అవుతారు. అభ్యర్థి 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే అధికారులు ఇక ప్రశ్నలు అడగడం ఆపేస్తారు. అలాగే 9 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోతే కూడా ప్రశ్నలు అడగడం ఆపేస్తారు అని యూఎస్సీఐఎస్ తన వెబ్సైట్లో వివరించింది. అయితే 65 ఏళ్లు పైబడి, కనీసం 20 ఏళ్లుగా స్థానికంగా నివసిస్తున్న వారికి మాత్రం ప్రత్యేక నిబంధనలు కొనసాగుతాయి. వారు 10 ప్రశ్నలలో 6 ప్రశ్నలకు సరైన జవాబిస్తే పాస్ అయిపోతారు.
నేర కార్యకలాపాలకు దూరంగా ఉన్నారా లేదా అన్న విషయంతోపాటు అమెరికా సమాజానికి అందచేసిన సేవలు ఏమిటన్న అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తారు. 1991 నుంచి పక్కనపెట్టిన పొరుగువారి నుంచి ఆరా తీయడం కూడా మళ్లీ చేపట్టాలని యూఎస్ఐసీఎస్ నిర్ణయించుకుంది. దరఖాస్తుదారుడు పనిచేస్తున్న సంస్థ యాజమాన్యం, సహ ఉద్యోగులు, ఇంటికి సమీపంలో నివసిస్తున్న వారి నుంచి కూడా అధికారులు ఆరా తీయనున్నారు. పౌరసత్వ పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యేందుకు అభ్యర్థులకు రెండు అవకాశాలు ఉంటాయని, రెండవ ప్రయత్నంలో కూడా ఫెయిల్ అయితే పౌరసత్వాన్ని తిరస్కరించినట్లుగా పరిగణించాలని యూఎస్సీఐఎస్ తెలిపింది.
‘వీసా ఇంటర్వ్యూ మినహాయింపు’ నిబంధనల్లో చేసిన మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీనివల్ల ఎంతోమంది అభ్యర్థులు, 18 ఏండ్ల లోపు, 79 ఏండ్లు దాటినవారు కచ్చితంగా అమెరికా ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాల్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.