హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): అనుమతుల కోసం ముడుపులు చెల్లించిన మెడికల్ కాలేజీల యాజమాన్యాలు, ఇందుకు సహకరించిన దళారుల గుట్టు రట్టయింది. నకిలీ అధ్యాపకులు, రోగులను సృష్టించి జాతీయ వైద్య మండలి అధికారులను మభ్యపెట్టిన ఘటన సంచలనం రేపుతున్నది. ఇది వైద్య విద్యా రంగానికే కళంకంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో ఇటీవల జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో తమకు అనుకూలంగా రిపోర్టులు ఇచ్చేందుకు దళారుల ద్వారా కొన్ని మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ ఉద్యోగులకు లంచాలు ముట్టజెప్పిటనట్టు సీబీఐ విచారణలో తేలడంతో ఇప్పటివరకు 36 మందిపై కేసు నమోదు చేసింది. నిందితుల్లో తెలంగాణ, ఏపీకి చెందిన ఆరుగురితోపాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన పూనం మీనా, ధర్మవీర్, పీయూష్, మల్యాన్, అనూప్, జైస్వాల్, రాహుల్ శ్రీవాత్సవ, చందన్‌కుమార్,యూజీసీ మాజీ చైర్మన్ డీపీ సింగ్ సైతం ఉండటం గమనార్హం. ప్రస్తుతం డీపీ సింగ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్నారు.
వరంగల్ జిల్లాలోని ఫాదర్ కొలొంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ట్రస్టీ ఫాదర్ జోసెఫ్ కొమ్మారెడ్డి రెండు విడతల్లో రూ.20 లక్షలు, రూ.46లక్షలు లంచం చెల్లించినట్టు సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొన్నది. లంచాల కోసం ఎన్ఎంసీ పెద్దలు పలు ప్రాంతాల్లో తమ అనుకూల వ్యక్తుల సాయం తీసుకున్నారని, వారిలో డాక్టర్ అంకం రాంబాబు (హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ), డాక్టర్ హరిప్రసాద్ (ఏపీలోని కదిరి), డాక్టర్ కృష్ణకిశోర్ (విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం) మెడికల్ కాలేజీల నుంచి డబ్బులు వసూలు చేసి ఎన్ఎంసీ సభ్యుడు డాక్టర్ వీరేంద్ర కుమార్‌కు పంపినట్టు సీబీఐ విచారణలో తేలింది. ఎన్ఎంసీ వద్ద పెండింగ్ పనులు పూర్తిచేస్తానని చెప్పి వైజాగ్‌లోని గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్ వెంకట్ నుంచి డాక్టర్ కృష్ణకిశోర్ రూ.50 లక్షలు తీసుకుని.. ఆ డబ్బును హవాలా మార్గంలో ఢిల్లీకి చెందిన మరో దళారి వీరేంద్రకు పంపినట్టు గుర్తించిన సీబీఐ.. ఈ కుంభకోణానికి సంబంధించి తెలంగాణ, ఏపీతోపాటు పలు రాష్ర్టాల్లో 40 చోట్ల సోదాలు నిర్వహించింది. నిందితులపై జూన్ 30న కేసు నమోదు చేసింది.
ఎన్ఎంసీ అధికారులు గోప్యమైన సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులతో పంచుకున్నారని, తనిఖీల సందర్భంగా లంచాలు తీసుకుని మెడికల్ కాలేజీల యాజమాన్యాలకు అనుకూలంగా రిపోర్టులు తయారు చేశారని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొన్నది. లీక్ అయిన సమాచారంలో తనిఖీకి సంబంధించిన షెడ్యూలు వివరాలు ఉన్నట్టు తెలిపింది. ఎన్ఎంసీ అధికారుల పర్యటన షెడ్యూల్ ముందే తెలియడంతో వైద్య కళాశాలల యజమానులు తనిఖీల సమయంలో నకిలీ అధ్యాపకులను, రోగులను ఏర్పాటు చేయడంతోపాటు బయోమెట్రిక్ హాజరును తారుమారు చేశారని, ఫైళ్లను ఫొటోలు తీసి దళారులతో పంచుకున్నారని తెలిపింది.