శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 20, 2020 , 02:37:29

పంట బీమా స్వచ్ఛందమే

పంట బీమా స్వచ్ఛందమే
  • పీఎంఎఫ్‌బీవై, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌ పథకాల నిబంధనల్లో మార్పు
  • 4,500 కోట్లతో కొత్తగా ఎఫ్‌పీఓల ఏర్పాటు
  • స్వచ్ఛభారత్‌ రెండో దశకు ఆమోదం..కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పంట బీమా పథకాలను ఇకపై స్వచ్ఛందం చేసింది. ప్రస్తుతమున్న పంట రుణాలపై గానీ లేదా కొత్తగా తీసుకునే రుణాలపై గానీ బీమా సదుపాయాన్ని పొందవచ్చని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పంట బీమా పథకాల అమలుపై రైతు సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ, కేంద్ర మంత్రివర్గం పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. పంట బీమా పథకాల అమలులో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంట బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌)’ను సంస్కరించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది.


 ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం పంట రుణం తీసుకున్న రైతులు పీఎంఎఫ్‌బీవై పథకం కింద తప్పకుండా బీమా చేయించాలి. విత్తనాలు వేయక ముందు నుంచి కోత కోసేంత వరకు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పీఎంఎఫ్‌బీవై కింద బీమా సదుపాయం కల్పిస్తున్నారు. ఇందుకుగాను వానాకాలం పంటలకైతే రెండు శాతం, యాసంగి పంటలకు ఒకటిన్నర శాతం, ఉద్యానవనాలు, వాణిజ్య పంటలకు ఐదు శాతం చొప్పున ప్రీమియం చెల్లించాలి. పీఎంఎఫ్‌బీవై, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌లోని కొన్ని పరిమితులు/నిబంధనల సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ‘ఈ రెండు పథకాలలో రైతులు స్వచ్ఛందంగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు’ అని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చెప్పారు. ఇక పాడి పరిశ్రమకిచ్చే రుణాలపై వడ్డీ రాయితీని రెండు శాతం నుంచి రెండున్నర శాతానికి పెంచారు. 


కొత్తగా పదివేల రైతు ఉత్పత్తుల సంఘాలు

2024 నాటికి రూ.4,500 కోట్ల బడ్జెట్‌ కేటాయింపులతో కొత్తగా పదివేల రైతు ఉత్పత్తుల సంస్థ (ఎఫ్‌పీఓ)లను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం రైతు ఉత్పత్తుల సంస్థలను ఏర్పాటుచేస్తున్నది. ఎఫ్‌పీఓ ఏర్పాటైన నాటి నుంచి ఐదేండ్ల పాటు ప్రభుత్వం డబ్బు రూపేణా సహకారం అందజేస్తుందని మంత్రి తోమర్‌ తెలిపారు. ఈ పథకం దాదాపు ఒకటిన్నర లక్షల ఉద్యోగాలను సృష్టించగలదని అన్నారు. 


22వ లా కమిషన్‌ ఏర్పాటుకు ఆమోదం

చట్టపరంగా క్లిష్టమైన అంశాలలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు 22వ లా కమిషన్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 21వ లా కమిషన్‌ గడువు 2018, ఆగస్టు 31తో ముగిసింది. కొత్తగా ఏర్పడే కమిషన్‌ గడువు మూడేండ్లు ఉంటుంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా ఉంటారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) రెండో దశకూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండో దశను 2020-21 నుంచి 2024-25 మధ్య అమలు చేయనున్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌ను రూ.52,497 కోట్లుగా అంచనా వేశారు.


logo