Mamata Benerjee | మమతా బెనర్జీ మంచి రైటర్ అంటూ పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్‌బోస్ ఆకాశానికెత్తారు. అంతటితో ఆగకుండా ఆమెను అబ్దుల్ కలాం, వాజపేయితో పోల్చారు. గవర్నర్ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు విసిరింది. అవును, నియంతలందరూ మంచి రైటర్లే అని బీజేపీ నేత సువేందు కామెంట్ చేశారు. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని చదివారంటూ చిందులేసింది. ఈ విషయంపై టీఎంసీ నేత శంతను సేన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గవర్నర్-సీఎంలు కలిసి పనిచేయడం బీజేపీకి నచ్చడం లేదంటూ విమర్శించారు.
కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ యూనివర్శిటీ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ సీవీ ఆనంద్‌బోస్ చేతుల మీదుగా సీఎం మమతా బెనర్జీకి డీలిట్ గౌరవ డిగ్రీని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగం పశ్చిమ బెంగాల్ రాజకీయాలను వేడెక్కించింది. స్నాతకోత్సవంలో మాట్లాడిన గవర్నర్.. సీఎం మమతను సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం, వాజపేయి, బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్తో పోల్చారు. వీరి మాదిరిగానే మమత కూడా మంచి రైటర్ అంటూ పొగిడారు. పశ్చిమ బెంగాల్ వాసిగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తుండటం గర్వకారణంగా ఉన్నదన్నారు.
గవర్నర్ ప్రసంగంపై బీజేపీ సెటైర్లు వేసింది. అసెంబ్లీలో చేసే స్పీచ్ మాదిరిగా ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని చదివారని బీజేపీ పక్ష నేత సువేందు అధికారి విమర్శించారు. హిట్లర్, ముస్సోలిని, సద్దాం హుస్సేన్, మావో జెడాంగ్లు కూడా మంచి రైటర్లే అని, వారు ఎన్నో పుస్తకాలు రాసారని సెటైర్లు వేశారు. అయితే, వీరంతా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని చెప్పారు. కాగా, బీజేపీ నేత వ్యాఖ్యలపై టీఎంసీ రాజ్యసభ ఎంపీ శంతను సేన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం గవర్నర్, ముఖ్యమంత్రి కలిసి పని చేయడాన్ని బీజేపీ చూడలేక అసూయతో ఉన్నదన్నారు. జగదీప్ ధన్కర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో రాజ్‌భవన్‌ను బీజేపీ తన పార్టీ కార్యాలయంగా ఉపయోగించుకున్నదని సేన్ ఆరోపించారు. ప్రస్తుత గవర్నర్ న్యాయంగా పనిచేస్తున్నారని, బీజేపీ చెప్పినట్లుగా మాత్రం నడుచుకోవడం లేదని అన్నారు.